జగిత్యాల పట్టణ చైర్ పర్సన్ బోగ శ్రావణి తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. స్థానిక ఒకే పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులకు గురి చేస్తున్నారని, ఆవేదనతోనే పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపి కంట తడి పెట్టుకున్నారు. ప్రశ్నించానని అడుగడుగునా ఇబ్బందులకు గురిచేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా అనంతరం శ్రావణి మీడియాతో మాట్లాడుతూ తనకు జరిగిన అవమానాలను ఏకరువు పెట్టారు. ‘దొర అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఓర్వలేక కక్ష కట్టారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దంటూ ఆర్డర్లు వేసేవాడు. ఈ పదవి నరకప్రాయంగా ఉంది.
మీకు పిల్లలు ఉన్నారు, వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని బెదిరించారు. డబ్బులడిగితే మేము ఇచ్చుకోలేం అని చెప్పాం. ఎమ్మెల్యేతో పోలిస్తే చైర్మెన్ పదవి చిన్నదని దెప్పిపొడిచేవారు. అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యా. అనుకూలంగా ఉన్న కౌన్సిలర్లను ఇబ్బంది పెట్టారు. జిల్లా కలెక్టర్‌ని కలవొద్దని ఆదేశించారు. చివరికి వార్డు సందర్శన చేసినా నేరమే. పేరుకు నేను చైర్ పర్సన్‌ని పెత్తనం అంతా ఎమ్మెల్యేదే. ఆయన ఇచ్చిన స్క్రిప్టే చదవాలి. కవితను ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తే వేధింపులు, కేటీఆర్ పేరు ప్రస్తావించకూడదని బలవంతంగా నోరు మూయించారు. సబ్బండ వర్ణాలు రాజకీయాలకు పనికి రారా? ఎమ్మెల్యే తీరుతో మాకు ప్రాణ హాని ఉంది. మాకు ఏమైనా జరిగితే ఆయనదే బాధ్యత. మాకు రక్షణ కల్పించాలని ఎస్పీని వేడుకుంటున్నా’నని తెలిపారు.