ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ స్థాయిలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. వందలకొద్దీ దొంగ ఓట్లు పడుతున్నాయి. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దిమ్మదిరిగే అవినీతి బయటపడింది. ఆరు, ఏడో తరగతి మాత్రమే చదివిన పలువురు వ్యక్తులు దర్జాగా ఓట్లేసి పోతున్నారు. ఆ విషయాన్ని వారే స్వయంగా మీడియాకు చెబుతున్నారు. ఎవరో తమకు స్లిప్పులు ఇచ్చి, ఓటేసి రమ్మన్నారని తెలిపారు. దీని వెనక భారీస్థాయిలో డబ్బు పంపిణీ జరిగినల్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల వందలాది బోగస్ ఓట్లు పడుతుంటే, కొన్ని చోట్లు ఉన్న ఓట్లు కూడా పోయాయి. తమ ఓట్లు గల్లంతయ్యాయని పలువురు ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పలు పోలింగ్ బూతుల్లో ఈ లీలలు వెలుగు చూశాయి. అనంతపురం జిల్లా రాప్తాడులో ఏకంగా 150 మంది దొంగ ఓటర్లను గుర్తించారు. నలుగురు దొంగలను పట్టుకున్న టీడీపీ వారిని పోలీసులకు అప్పగించింది. తిరుపతిలోని ఓ ఇంట్లో ఏకంగా 18 బోగస్ ఓట్లు వెలుగు చూశాయి. ఈ వ్యవహారంపై టీడీపీ, వైకాపా మధ్య గొడవ జరిగింది. పోలీసులు 50 మంది టీడీపీ కార్యకర్తలను అరెస్ చేశారు. పలు బూతుల్లో దొంగ ఓటర్లను గుర్తిస్తుండంతో టీడీపీ, వైకాపీ వర్గాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అక్రమాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈసీ లేఖ రాశారు. 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.