బెంగుళూరు పోలీసులకు అడ్డంగా దొరికిన..బాలీవుడ్ నటుడు - MicTv.in - Telugu News
mictv telugu

బెంగుళూరు పోలీసులకు అడ్డంగా దొరికిన..బాలీవుడ్ నటుడు

June 13, 2022

బాలీవుడ్ నటుడు, ప్రముఖ నటి శ్రద్దా కపూర్ సోదరుడు సిద్ధార్థ కపూర్ ఓ రేవ్ పార్టీలో బెంగుళూరు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. మాదక ద్రవ్యాలు తీసుకున్నారనే పక్కా సమాచారంతో ఆదివారం రాత్రి పోలీసుల అతడిని అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులోని ఎంజీ రోడ్డులో రేవ్ పార్టీ జరుగుతున్న హోటల్‌పై పక్క సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.

ఈ దాడిలో దాదాపు 35 మంది నుంచి నమూనాలు తీసుకుని, ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్‌‌ ప్రకారం.. సిద్ధార్థ కపూర్‌తోపాటు మరో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. దాంతో డ్రగ్స్ సేవించి పార్టీకి వచ్చారా? లేక హోటల్లో పార్టీకి వచ్చిన తర్వాత డ్రగ్స్ తీసుకున్నారా? ఎక్కడి నుంచి వీరికి డ్రగ్స్ సరఫరా అయ్యింది? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. “సిద్ధార్థ కపూర్ డ్రగ్స్ సేవించినట్టు పరీక్షలో పాజిటివ్ వచ్చింది. అతడిని ఉల్సూర్ పోలీసు స్టేషన్ కు తరలించాం” అని బెంగళూరు ఈస్ట్ డివిజన్ డీసీపీ భీమశంకర ఎస్ గులేద్ తెలిపారు.

మరోపక్క సిద్ధార్థ కపూర్ బాలీవుడ్ అందాల తార శ్రద్ధా కపూర్ సోదరుడు. 2020లో వచ్చిన వెబ్ సిరీస్ భౌకాల్‌లో సిద్ధార్థ కపూర్ చింటూ దేదా పాత్రలో నటించారు. ‘షూట్‌వుట్ ఎట్ వడాల’, ‘అగ్లీ, హసీనా పర్కార్’ తదితర సినిమాల్లోనూ నటించి, ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘ధోల్, చుప్ చుప్ కే’ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.