బాలీవుడ్‌కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే సీనియర్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణంతో అంతా శోఖ సంద్రంలో ఉండగానే మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. దిగ్గజ నటుడు రిషి కపూర్ గురువారం ఉదయం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. 67 ఏళ్ల వయస్సులోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
2018 నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.ఈ క్రమంలో ఆయన కొంత కాలం చికిత్స తీసుకున్నాడు. ఇటీవల ఆయన యోగా చేస్తున్న ఫొటోలను కూడా రిషి కపూర్ భార్య నితూ కపూర్ పోస్టు చేశారు. కానీ మరోసారి అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఆయన మృతిపట్ల సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా రిషి కపూర్ 1973లో బాబీ సినిమాతో రుషి కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దివానా, కాదల్, లైలా మజ్నూ, చాందినీ లాంటి సినిమాలను ఆయన చేశారు. 1980లో హీరోయిన్ నీతూ సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు.
51 సినిమాల్లో నటించిన ఆయన 41 మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. బాలీవుడ్‌ను శాసించిన కపూర్ ఫ్యామిలి నుంచి ఆయన అగ్రశ్రేణి నటుడిగా ఎదిగారు. ఆయన సోదరుడు రణధీర్ కపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్ కూడా హీరోలుగా రాణిస్తున్నారు. రిషికపూర్ మరణంతో బాలీవుడ్ శోఖసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణం తన మనసును ముక్కలు చేసిందని బిగ్ బి అమితాబచ్చన్ ట్వీట్ చేశారు.