సంజయ్ దత్ మళ్లీ రాజకీయాల్లోకి!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని మహారాష్ట్ర మంత్రి మహాదేవ్ జంకర్ తెలిపారు. సెప్టెంబర్ 25న రాష్ట్రీయ సమాజ్ పక్ష్‌లో చేరనున్నారని ఆదివారం ప్రకటించారు. పార్టీని బలపరిచే క్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు, అందులో భాగంగానే సంజయ్‌ని సంప్రదించినట్లు తెలిపారు. ఐతే ఈ విషయమై సంజయ్ దత్ నుంచి అధికారిక ప్రకటన వెలబడాల్సి ఉంది.
గతంలో సంజయ్ దత్ సమాజ్ వాదీ పార్టీలో కొంత కాలం కొనసాగారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ రాజధాని లక్నో నుంచి పోటీ చేయాలనుకున్నారు.. కానీ, ఆయనపై ఉన్న కేసులు అడ్డంకిగా మారడంతో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. తరువాత ఎస్పీ పార్టీకి పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా జంకర్ ప్రకటనతో మరోసారి సంజయ్ దత్ రాజకీయ రీఎంట్రీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఆయన పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ ముంబయి వాయువ్య లోక్‌సభ నియోజవకర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రిగాను బాధ్యతలు కూడా నిర్వర్తించారు.