భారత సైన్యంపై కారుకూతలు.. బాలీవుడ్ బ్యూటీ బుద్ధిలేని చర్యలు
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెత ఊరికే రాలేదేమో. నరం లేని నాలుకతో వాగితే ఈ సొషల్ మీడియా ఎరాలో తిప్పలు తప్పవు. కాస్త హద్దులు దాటితే తోకలు కత్తిరించేందుకు చట్టం కంటే ముందే నెటిజన్స్ రెడీగా ఉంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ‘రిచా చద్దా’కి తగిన గుణపాఠం చెప్పింది సోషల్ మీడియా. ఏకంగా ఆమె భారత్ ఆర్మీని కించపరుస్తూ ట్వీట్ చేయటం దేశంవ్యాప్తంగా పెద్ద దుమారం లేపింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చేసిన ప్రకటనపై రిచా చద్దా తన ట్విట్టర్ లో సెటైర్స్ వేసింది. దీంతో నెటిజన్స్ ఆమెని ఏకిపారేయటంతో దిగుచ్చింది. చైనీస్‌తో 2020 గాల్వాన్ ఘర్షణను ప్రస్తావిస్తూ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)ని తిరిగి తీసుకోవడంపై టాప్ ఆర్మీ కమాండర్ చేసిన ప్రకటనను అపహాస్యం చేసేలా వ్యాఖ్యానించింది రిచా. తర్వాత ఆ వివాదాస్పద ట్విట్టర్ పోస్ట్‌ను తొలగించి బహిరంగ క్షమాపణలు చెప్పేసింది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి దక్కించుకుంటామని ఆర్మీ చేసిన వ్యాఖ్యలపై రిచా చద్దా స్పందిస్తూ.. ‘గాల్వాన్ సేస్ హాయ్’ అని ట్వీట్ చేసింది. భారతదేశం మరియు చైనాల మధ్య 2020 గాల్వాన్ ఘర్షణలో భారత జవాన్ల త్యాగాన్నిఎగతాళి చేసేలా ఆమె ట్వీట్ ఉందంటూ నెటిజెన్లు ఫైర్ అయ్యారు. దీంతో ఆ కామెంట్స్ ని డిలీట్ చేసి.. మరో పోస్ట్ పెట్టింది రిచా. "ఆర్మీని కించపరచడం నా ఉద్దేశ్యం కానప్పటికీ, నేను వాడిన ఆ 3 పదాలు ఎవరినైనా నొప్పించినట్లయితే, లేదా బాధ పెట్టినట్లయితే.. నేను క్షమాపణలు కోరుతున్నాను. అనుకోకుండా నా మాటలు మిమ్మల్ని నొప్పించినట్లయితే అది నన్ను బాధపెడుతుంది. ఫౌజ్ (సైన్యం)లో నా సోదరులు, నానాజీ విశిష్టమైన పాత్ర పోషించారు" అని రిచా చద్దా క్షమాపణల ట్వీట్ చేసింది. ఇక రిచా క్షమాపణలు చెప్పకముందు బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ.. ‘అవమానకరమైన ట్వీట్, వీలైనంత త్వరగా ఉపసంహరించుకోవాలి. మన సాయుధ బలగాలను అవమానించడం సమంజసం కాదు’ అంటూ హెచ్చరించాడు. కాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడమే భారత్ లక్ష్యమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ప్రస్తావించారు.