రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో సినీ నటులు పాల్గొంటున్నారు. పూనమ్ కౌర్, పూజా భట్, రియాసేన్.. ఇలా కొందరు రాహుల్ పాదయాత్రలో పాల్గొని ఆయన వెంట నడిచారు. తమకు తెలిసిన కొన్ని సూచనలు, సలహాలిస్తూ.. యాత్రకు చేతనైన సాయం అందించారు. తాజాగా గురువారం నాడు భారత్ జోడో యాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటి స్వరభాస్కర్ పాల్గొన్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వెంట సినీనటి స్వరభాస్కర్ భారత్ జోడో యాత్రలో నడిచారు. రాహుల్ గాంధీతో స్వరభాస్కర్ మాట్లాడుతూ నడిచారు. ఆమెతోపాటు ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ జోడో యాత్ర 150 రోజుల్లో 12 రాష్ట్రాల్లో 3,570 కిలోమీటర్లు నడిచేలా ప్లాన్ చేశారు.
దేశాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో సాగుతున్న ఈ యాత్ర 83వ రోజు గురువారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మీదుగా సాగుతోంది. గతవారం తన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి రాహుల్ నడిచారు.సెప్టెంబరు 7వతేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇప్పటివరకు 7 రాష్ట్రాల్లోని 36 జిల్లాల మీదుగా సాగింది. మరో 1209 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది.