ఉత్తరాది, దక్షిణాది విభేదాలు ఇటీవల సినిమా ప్రపంచంలోనూ కనిపిస్తున్నాయి. టాలీవుడ్ సినిమాలు నార్త్‌లోనూ, వరల్డ్‌లోనూ దుమ్మురేపుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌కు కడుపు మండుతోంది. మరోపక్క ఉత్తరాదిని దున్నేద్దామని వెళ్తున్న దక్షిణాది హీరోహీరోయిన్లకు అక్కడ మిశ్రమ స్పందన లభిస్తోంది. దీపికా పదుకోన్ వంటి వారికి అందలం, మరికొందరికి అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ దక్షిణాది సెలబ్రిటీ జోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రష్మిక మందన, విజయ్ దేవరకొండలను ఎగతాళి చేస్తూ కలకలం రేపాడు. దక్షిణాదిలో మాంచి హిట్లు కొట్టి బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వీరిపై విషం కక్కాడు. బాక్సాఫీసు వద్ద బోల్తాపడిన విజయ్ ‘లైగర్’ మూవీని కూడా వదల్లేదు.
‘‘రష్మికా మేడమ్.. మీ బాయ్‌ఫ్రెండ్ అనుకొండ మూవీ లైగర్‌ను మా హిందీ ప్రేక్షకులు బాలీవుడ్ నుంచి తరిమికొట్టిన సంగతి మీకు తెలుసనుకుంటా. మీ మూవీ విషయంలోనూ ఇదే చేస్తాం. మిమ్మల్ని భోజ్‌పురి సినిమాల్లో చూడడం మాకు ఆనందం.. ’’ అని ఖాన్ ట్వీట్ చేశారు. రష్మిక సిద్ధార్థ మహోత్రాకు జోడీగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘మిషన్ మజ్ను’ త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. వీటిపై దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులు తిట్టిపోసుకుంటున్నారు. బాలీవుడ్‌కు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయని, ఖాన్ అక్కసే దానికి నిదర్శనమని దక్షిణాది వాళ్లు, టాలెంట్ ఉంటే ఎవరినైనా ఆదరిస్తామని, చెత్త సినిమాలను భరించేమంటూ ఉత్తరాది వాళ్లు ట్వీటుకుంటున్నారు. పుష్ప, బాహుబలి, ఆర్ఆర్ఆర్, కార్తికేయ సినిమాలను ఆదరించామని గుర్తుచేస్తున్నారు.
Madam @iamRashmika Ji hope you know, what we Hindi audiences did with your boyfriend Anakonda film #Liger and throw him out of Bollywood. Exactly same, we are going to do with you. But we will be happy to watch you in Bhojpuri films.
— KRK (@kamaalrkhan) January 9, 2023