వావ్.. అక్షయ్ విరాళం రూ. 25 కోట్లు  - MicTv.in - Telugu News
mictv telugu

వావ్.. అక్షయ్ విరాళం రూ. 25 కోట్లు 

March 28, 2020

Bollywood hero akshya kumar donates 25 crore corona donation to pm relief fund .

మనసున్న అందరూ స్పందించాల్సిన సమయం ఇది. కరోనా లాక్‌డౌన్‌తో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. నిరుపేదల బాధలు వర్ణనాతీతం. అయినా భూదేవి అంత సహనంతో అందరి కోసం వారు పంటిబిగువునా బాధలు అనుభవిస్తున్నారు. వారిని ఆదుకోడానికి సహృదయులు భూరి విరాళాలు ప్రకటిస్తున్నారు. వెండితెరపై హీరోగా మంచిపనులతో ఆకట్టుకునే నటులు కూడా నిజజీవితంలోనూ హీరోలు అనిపించుకుంటున్నారు. 

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇప్పుడు హీరోలకే హీరోగా మారాడు. ఏకంగా రూ. 25 కోట్ల విరాళం ప్రకటించాడు. ప్రధానమంత్రి సహాయనిధికి ఆయన ఈ డబ్బులు సమకూర్చారు. టాలీవుడ్, కోలీవుడ్ తప్పితే ఇతర భాషా సినీనటులు పెద్దగా స్పందించని తరుణలో అక్షయ్ ఈ విరాళంతో మరింతగా ఆకట్టుకున్నాడు. ‘ఇది మన ప్ర‌జ‌ల ప్రాణాలను కాపాడుకోవ‌ల‌సిన స‌మ‌యం. అందరూ తమకు తోచినంత సాయం చేయాలని కోరుతున్నాను, నా వంతుగా పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.25 కోట్ల విరాళం అందజేస్తున్నాను’ అని అక్షయ్ ట్వీట్ చేశారు. అతణ్ని ప్రధాని మోదీతోపాటు నెటిజన్లు అభినందిస్తున్నారు. అక్షయ్ విరాళాలకు పెట్టింది పేరు. ప్రకృతి విపత్తుల సమయాల్లోనే కాకుండా స్వచ్ఛభారత్ వంటి పథకాలకు కూడా ఆయన భారీ విరాళాలు ప్రకటిస్తుంటారు.