bollywood hero sonu sood wins heart again saves passengers life at airport
mictv telugu

మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్..ఈసారి ఏం చేశారంటే..!!

January 18, 2023

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సోనూసూద్. తెరపై విలన్ గా నటించిన సోనూసూద్…కోవిడ్ కాలంలో రియల్ హీరోగా యావత్ దేశం గర్వించేలా చేశారు. వలస కూలీల నుంచి కోవిడ్ కారణంగా కష్టాల్లో ఉన్నవారికి సోనూసూద్ చేసిన సాయం ఎప్పటికీ మరిచిపోలేనిది. ఈరోజు వరకు ఏదొక సాయం కోసం సోనూసూద్ నివాసం వద్ద గుంపుగుంపులుగా జనం ఉంటున్నారు. సాయం కోసం తన ఇంటి వద్దకు వచ్చే ప్రతిఒక్కరికీ తన వంతు సాయం అందిస్తున్నారు. లేటెస్టుగా సోనూసూద్ దుబాయ్ ఎయిర్ పోర్టులో చేసిన పనిని అక్కడి సిబ్బందిని, అభిమానులను షాక్ కు గురి చేసింది.

తన తెలివితేటలతో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన సోనూసూద్
ఓ వార్త సంస్థ తెలిపిన వివరాల ప్రకారం…సోనూసూద్ దుబాయ్ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద వేచి ఉన్నాడు. ఇంతలో అక్కడ ఒక వ్యక్తి స్పృహతప్పి పడిపోయాడు. ఆ వ్యక్తిని చూసిన జనం ఎవరూ కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. వెంటనే అక్కడికి వెళ్లిన సోనూసూద్ ఆ వ్యక్తి తలపట్టుకుని అతనికి సపోర్ట్ చేస్తూ కార్డియోపల్మోనరీ రిససిటేషన్ అందించాడు. కొన్ని నిమిషాల తర్వాత ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చాడు.

సోనూసూద్ చేసిన ఈ పనికి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. అభిమానులే కాకుండా ఘటనాస్థలానికి చేరుకున్న వైద్యులు కూడా సోనూసూద్ చేసిన పనిని కొనియాడారు. స్పృహలోకి వచ్చిన తర్వాత, ఆ వ్యక్తి సోనూకి తన ధన్యవాదాలు తెలిపాడు. ఈ విష‌యం బ‌య‌ట‌కి వ‌చ్చిన వెంట‌నే అభిమానులు ఆయ‌న‌పై సోష‌ల్ మీడియాలో విపరీతంగా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.