మహబూబాబాద్ జిల్లాలో బాంబు పేలుడు కలకలం రేపింది. బయ్యారం పెద్ద చెరువు కట్టపై బాంబు పేలి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అతడి చేతులు నుజ్జునుజ్జు అయ్యాయి .దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నలుగురు స్నేహితులు కలిసి చెరువు కట్టపైకి కల్లతాగేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారికి ఓ ప్లాస్టిక్ కవర్ కనిపించింది. దానిని విప్పి చూడగా ఒక్కసారి బ్లాస్ట్ అయ్యింది. ఈ ప్రమాదంలో బోదంగండ్ల రవికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు చేతులు పూర్తిగా నుజ్జు నుజ్జు కాగా, కళ్లు కూడా దెబ్బతిన్నాయి. అతడి స్నేహితులు వెంటనే క్షతగాత్రుడిని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం అక్కడ నుంచి హైదరాబాద్ దవాఖానకు తరలించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు పేలుడుకు సంబంధించిన అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇది నక్సలైట్ల పనా, లేకపోతే వేటకు వాడిన మందుగుండి సామాను పేలిందా అని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. బాంబులు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు . గ్రామంలో బాంబు పేలుడుతో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.