కూతురికి 18 ఏళ్లు నిండినా భరణం ఇవ్వాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

కూతురికి 18 ఏళ్లు నిండినా భరణం ఇవ్వాల్సిందే..

April 7, 2018

తల్లిదండ్రులు విడిపోవటం విడిపోతారు గానీ ఆ ప్రభావం పిల్లల మీద బలంగా పడుతుంది. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది ఈ ఘటన. 18 ఏళ్ళు నిండిన కుమార్తె ఖర్చులు భరించనని చేతులెత్తేసిన కన్నతండ్రి మీద  ఆ తల్లి న్యాయస్థానాల్లో పోరాడింది. బాంబే హైకోర్ట్ కూతురు నిర్వహణ కోసం డబ్బులు ఇవ్వవలసిందేనని తీర్పు ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే.. బాంబేకి చెందిన ఓ మహిళ తన 19ఏళ్ల కూతురుకు భర్త నుంచి నిర్వహణ ఖర్చులు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా మైనర్‌ పిల్లలకు మాత్రమే భరణం లభిస్తుందని చెప్తూ కుటుంబ కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఆమె బాంబే కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆమె పిటిషన్‌లో న్యాయం వుందని.. కూతురు పెళ్ళి అయ్యేవరకు తండ్రి ఆమె నిర్వహణకు డబ్బులు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. సదరు మహిళ తన భర్త నుంచి నెలకు రూ.25వేల భరణం పొందుతుండగా, తన కూతురు ఖర్చుల కోసం మరో 15వేల రూపాయలు కావాలని పిటిషన్‌లో కోరుతోంది.కోర్టులో పిటిషన్‌ వేసిన మహిళకు 1988లో వివాహం జరిగింది. వీరు 1997లో విడిపోయారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వారు తల్లి వద్దే ఉంటున్నారు. పిల్లలు మైనర్లుగా ఉన్నంత వరకు తండ్రి  ముగ్గురు పిల్లలకు నిర్వహణ ఖర్చులు ఇచ్చేవారు. కాగా కుమార్తెకు 18 ఏళ్ళు నిండాయి కాబట్టి ఆమె నిర్వహణ ఖర్చులు ఇవ్వనని తండ్రి చెప్పటంతో సదరు మహిళ న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగింది. కూతురు మేజర్ అయినప్పటికీ తనమీదే ఆధారపడిందని తెలిపింది. కొడుకులు కూడా సహాయం చేసే స్థితిలో లేరని తన పిటిషన్‌లో పేర్కొంది. ఒక కొడుకు ఎడ్యుకేషన్ లోన్ కట్టుకుంటున్నాడు. ఇంకొక కొడుకుకు ఇంకా ఉద్యోగం రాలేదని తెలిపింది. ఇదిలా వుండగా తన కూతురు తరఫున తల్లి తన భర్త నుంచి నిర్వహణ ఖర్చులు కోరడంలో న్యాయం వుందని జస్టిస్‌ భారతి డాంగ్రే తెలిపారు.