ఏపీ మాజీ మంత్రి తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వర్ రావు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఓ హోటల్ నుంచి హీరోయిన్‌తో కలిసి బయటకు వస్తున్నట్టుగా ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేశారని పేర్కొన్నారు. దీని ద్వారా తనపై అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు. వెంటనే పోలీసులు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. సదరు హీరోయిన్‌తో ఎలాంటి పరిచయం లేదని తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు చేసిన వారిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తే ప్రత్యర్థులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘తప్పుడు ఆరోపణలు చేయడం కాదురా జఫ్పా పేటియం బ్యాచ్.. దమ్మున్నోడిలా పోలీస్ ఫిర్యాదు చేశా. మీ నాయకుడి అభిమాన జైలు అయిన చంచల్ గూడా వెళ్లేందుకు సిద్దంగా ఉండండి’ అని పేర్కొన్నారు. ఇలాంటి అసత్య పోస్టింగుల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అభిప్రాయపడ్డారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.