Bonuses in Telangana from today..
mictv telugu

తెలంగాణలో నేటి నుంచే బోనాలు..మొదలైన సందడి

June 30, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బోనాల సందడి మొదలైంది. ఆషాఢ మాసం రాకతో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. బోనాల ఉత్సవాలు షురూ కానున్న సందర్భంగా నగరంలోని బస్తీలు, కాలనీలు కళకళలాడనున్నాయి.

ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు లంగర్ హౌస్ చౌరస్తాలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. అంతకంటే ముందు.. లంగర్ హౌస్ చౌరస్తా నుంచి అమ్మవారి పట్టువస్త్రాల తొట్టెల ఊరేగింపుతో జాతర ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి గోల్కొండ కోటకు చేరుకుంటుంది. మధ్యలో చోట బజార్లోని పూజారి అనంత చారి ఇంట్లో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు చేసి, ఊరేగింపు సాయంత్రానికి కోటలోని జగదాంబిక మహంకాళి(ఎల్లమ్మ) అమ్మవారి దేవాలయానికి చేరుకుంటుంది. ఆ తర్వాత కోట పైన అమ్మవారికి భారీ తొట్టెలను సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు.

తెలంగాణలో ఆషాఢ మాసం బోనాలు నగరంలో నెల రోజుల పాటు జరగనున్నాయి. చారిత్రక గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జూన్‌ 30 నుంచి జూలై 28వరకు ఆషాఢ మాసం బోనాలు జరుగుతాయి. గోల్కొండ బోనాల తర్వాతి వారం ల‌ష్కర్‌ (సికింద్రాబాద్)లో, ఆ త‌ర్వాత లాల్ ద‌ర్వాజా, ధూళ్‌పేట‌, బ‌ల్కంపేట‌, పాతబ‌స్తీ అమ్మవారి ఆల‌యాల్లో బోనాల ఉత్సవం జరుగుతుంది. జులై17న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, 18న రంగం భవిష్యవాణి ఉంటుంది. జులై 24న పాతబస్తీ బోనాలు, 25న ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు.