విజృంభిస్తున్న కరోనా.. మొదలైన మరణాలు - MicTv.in - Telugu News
mictv telugu

విజృంభిస్తున్న కరోనా.. మొదలైన మరణాలు

March 19, 2022

02

కరోనా మహమ్మారి విజృంభన మళ్లీ మొదలైంది. రెండు సంవత్సరాలపాటు యావత్ ప్రపంచ దేశాలను చిత్రహింసలకు గురిచేసిన మహమ్మారి.. మళ్లీ ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. ప్రజలంతా కరోనా పని అయిపోయింది. ఇకనుంచి అందరూ రిలాక్స్‌గా పనులు చేసుకొవచ్చని ఆనందంగా గడుపుతున్న సమయంలో మహమ్మారి కోరలు చాచేందుకు సిద్ధమైంది. దక్షిణ కొరియాలో ఒకేరోజు 6 లక్షల కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కరోనాకు పుట్టినిల్లయిన చైనాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయని అక్కడి అధికారులు వెల్లడించారు.

మరోవైపు దాదాపు ఏడాది కాలం తర్వాత చైనాలో మరణాలు కూడా మొదలైయ్యాయని వైద్యులు తెలిపారు. జిలిన్ ప్రావిన్స్‌లో ఇద్దరు వ్యక్తులు కరోనా కారణంగా మృతి చెందారని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఇక చైనాలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో స్థానిక సింప్టొమేటిక్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు తెలిపారు.

గతకొన్ని రోజులుగా కేసులు పెరుగుతుండటంతో చైనా అప్రమత్తమవుతోంది. కఠిన ఆంక్షలను విధిస్తోంది. ఇటీవల కనీసం 10 నగరాల్లో లాక్‌డౌన్ విధించింది. వీటిలో టెక్ హబ్‌గా పేరుగాంచిన షెంజెన్ కూడా ఉంది. తాజా పరిణామాలను ప్రపంచ ఆరోగ్య నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు. కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని చెపుతున్నారు. జూన్, జులై మాసాల్లో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అజాగ్రత్తగా ఉండొద్దని, మహమ్మారి తీవ్రత ఇంకా అయిపోలేదని పేర్కొంది. కావున దేశ ప్రజలు మాస్కులు, శానిటైజర్స్‌ను, భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలని ప్రజలను కోరింది.