ఫిబ్రవరి 30న పుట్టాడు.. పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్నాడు! - MicTv.in - Telugu News
mictv telugu

ఫిబ్రవరి 30న పుట్టాడు.. పుట్టెడు కష్టాలు అనుభవిస్తున్నాడు!

December 18, 2017

కొన్ని పొరపాట్లను అంత ఈజీగా సవరించుకోలేం. ఎవరో ఏదో చేస్తారు.. ఫలితం మాత్రం మరొకరు అనుభవిస్తారు.. పంజాబ్‌లోని లూధియానాకు చెందిన హ‌ర్‌ప్రీత్ సింగ్ ఇలాంటి బాధితుడే. అతని పుట్టిన రోజు విషయంలో అధికారులు ఘోరాతిఘోరమైన తప్పిదం చేశారు.

అతడు ఫిబ్రవరి 30 పుట్టినట్లు బర్త్ సర్టిఫికెట్లో రాసిపారేశారు. ఫిబ్రవరిలో 30వ తేదీ ఉండదన్న కనీస ఇంగితగ్నానం లేకుండా అతని జీవితాన్ని నాశనం చేవారు. ఉన్నత చదువు చదివి విదేశాలకు వెళ్లాలన్న అతని కోరికకు ఇది పెద్ద ఆటంకంగా మారిపోయింది.

ఈ మహత్తర సర్టిపికెట్ పై ఒక సివిల్ స‌ర్జ‌న్‌, మ‌రో ముగ్గురు ఆరోగ్య‌శాఖ అధికారులు సంత‌కం గెలకడం విశేషం. సింగ్ 2012లో ఆర్థిక ఇబ్బందుల వల్ల చ‌దువు ఆపేశారు.  2015లో మ‌ళ్లీ ఓపెన్ స్కూల్ విధానంలో ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాశాడు. పాసయ్యాక 12వ త‌ర‌గ‌తిలో చేరడానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. దీనికోసం బర్త్ సర్టిఫికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నాడు.

అధికారులు ఇచ్చారు. కానీ అందులో ఫిబ్రవరి 30న పుట్టినట్లు రాయడతో సింగ్‌ను 12వ తరగతిలో చేర్చుకోవడానికి కాలేజీలు నిరాకరించాయి.. భవిష్యత్తులో కెనడాకు వెళ్లడానికి వీలుగా పాస్ పోర్టుకు అప్లయ్ చేసుకున్నాడు. కానీ ఈ వింత బర్త్ సర్టిఫికెట్ చూసి అధికారులు విస్తుపోయి నో అన్నారు.  ఈ సమస్య నుంచి బయటపడేయమని సింగ్.. ఎన్నోసార్లు అధికారులకు దరఖాస్తులు చేసినా ఫలితం మాత్రం ఉండడం లేదు.