ఉద్యోగుల కాళ్లు కడిగిన బాస్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగుల కాళ్లు కడిగిన బాస్..

November 8, 2019

మనం మరొకరి కాళ్లను ఎప్పుడు కడుగుతాం?  పెళ్లిళ్లలో, ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు జరిగితే వేదపండితులనో అలా గౌరవిస్తుంటారు.  లేదా ఎవరైనా మంచి చేస్తే నీ కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటా అంటుంటాం. కానీ చైనాలో మాత్రం ఓ కంపెనీ బాసులు నిజంగానే కాళ్లు  కడిగారు. తమ సంస్థ కోసం కష్టపడి పనిచేసిన ఉద్యోగులను ఇలా గౌరవించి తమ కృతజ్ఞతను తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని జినాన్‌లో ఈనెల 2న జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఇది జరిగింది. ఓ కాస్మొటిక్ కంపెనీకి ఇటీవల తన టార్గెట్‌కు మంచి సేల్స్ జరిగాయి. ఈ సేల్స్ చేయడంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 8 మందిని ఎంపిక చేశారు. వారందరిని స్టేజీపై కూర్చోబెట్టి కంపెనీ ప్రతినిధుల ముందు కాళ్లు కడిగి సత్కరించారు. 

దీన్ని కూడా సాధాసీదాగా చేయకుండా ఎంతో గౌరవ మర్యాదలతో నిర్వహించారు.  ఆ కాస్మోటిక్‌ కంపెనీ అధ్యక్షుడు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ వచ్చి ముందుగా వారికి వినమ్రంగా నమస్కరించారు. వారిని స్టేజీపైకి తీసుకెళ్లి కుర్చీల్లో వరుసగా కూర్చోబెట్టి.. వారు వేసుకున్న షూలను అధ్యక్షుడు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ తమ చేతులతో విప్పారు. ఆ తర్వాత వారి పాదాలను ఓ  పెద్ద పాత్రల్లో పెట్టి నీటితో కడిగారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో భిన్న రకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరు కంపెనీ యజమానులు ఉద్యోగుల పట్ల ఉన్న గౌరవాన్ని సమర్థిస్తున్నారు. మరి కొందరు మాత్రం బోనస్‌లు కూడా వారికి అందజేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.