ఆంధ్రప్రదేశ్‌లోని పదోవ తరగతి విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీపికబురు చెప్పారు. జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండు చొప్పున ప్రభుత్వ జూనియర్ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచే టెన్త్ పాసైన విద్యార్ధులు ఇంటర్లో చేరేందుకు వీలుగా ఆయా మండలాల్లో రెండేసి హైస్కూళ్లలో ఇంటర్ తరగతులను (10 + 2) స్టార్ట్ చేస్తామని అన్నారు.
విజయవాడలో బుధవారం ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ..”రాష్ట్రంలో 679 మండలాలు ఉన్నాయి. ఆయా మాండలాల్లో రెండు చొప్పున మొత్తం 1,358 ఇంటర్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం 474 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. మిగతా 884 కళాశాలల్లో కూడా తరగతులు ఈ ఏడాదే నుంచే ప్రారంభిస్తాం. టెన్త్ పాసైన విద్యార్ధులు ఇంటర్లో చేరేందుకు ప్రతి మండలాల్లో రెండేసి హైస్కూళ్లలో ఇంటర్ తరగతులు (10 + 2) ప్రారంభిస్తాం. వీటిలో ఒకటి కో-ఎడ్యుకేషన్ కాలేజీ. మరోకటి బాలికల కోసం ప్రత్యేక కాలేజ్‌ని ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం ఉన్న జూనియర్ కాలేజీలలో కొన్నిటిని బాలికల కళాశాలలుగా మార్పు చేస్తున్న క్రమంలో 25 చోట్ల సమస్యలు తలెత్తుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తాం. ప్రైవేట్ కాలేజీల కంటే మిన్నగా మంచి సదుపాయాలతో, ఉత్తమ బోధన అందేలా చర్యలు చేపడుతున్నాం” అని ఆయన అన్నారు.