మరో సంచలన విషయం పేర్లతో సహా వెల్లడించిన బౌలర్ చహల్ - MicTv.in - Telugu News
mictv telugu

మరో సంచలన విషయం పేర్లతో సహా వెల్లడించిన బౌలర్ చహల్

April 12, 2022

04

టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఇటీవల ఓ క్రికెటర్ తనను 15వ అంతస్థు నుంచి వేలాడదీశాడని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చహల్ ఇంకో దిగ్భ్రాంతికర విషయం వెల్లడించాడు. అప్పుడు ఆ ఆటగాడి పేరు చెప్పని చహల్, ఈ సారి వారి పేర్లను బయటపెట్టాడు. ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ ఇద్దరూ కలిసి తనను కట్టేసి ఓ గదిలో పడేసి రాత్రంతా ఉంచారని వివరించాడు. ‘2011లో ముంబయి జట్టు ట్రోఫీ గెలిచింది. అప్పుడు మేం చెన్నైలో ఉన్నాం. బాగా మద్యం తాగిన సైమండ్స్ జేమ్స్‌తో కలిసి నా కాళ్లు, చేతులు కట్టేశారు. విడిపించుకోవాలని ప్రయత్నిస్తే నా నోటికి టేప్ చుట్టేశారు. ఆ రాత్రంతా నన్ను గదిలో వదిలేసి వాళ్లు పార్టీ చేసుకోవడానికి వెళ్లిపోయారు. పొద్దున రూం క్లీన్ చేయడానికి వచ్చిన సిబ్బంది నన్ను గమనించి నా కట్లు విప్పారు’అని చెప్పాడు. ఈ ఘటన గురించి వారు ఇప్పటివరకూ తనకు క్షమాపణలు చెప్పలేదని వాపోయాడు. కాగా, జేమ్స్ ఫ్రాంక్లిన్ ఇప్పుడు ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో డుర్హామ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేస్తున్నారు. చహల్ ఉదంతం విన్న ఆ జట్టు మేనేజ్‌మెంట్ స్పందిస్తూ.. ఈ ఘటనపై తమ క్లబ్ విచారణ జరుపుతుందని, నిజాలను నిర్ధారించుకుంటామని స్పష్టం చేసింది.