లొల్లి లేకుండా..నిజామాబాద్‌ బాక్సర్‌తో మేరీకోమ్ ఢీ! - MicTv.in - Telugu News
mictv telugu

లొల్లి లేకుండా..నిజామాబాద్‌ బాక్సర్‌తో మేరీకోమ్ ఢీ!

November 9, 2019

బాక్సింగ్ విభాగంలో ట్రయల్ పోటీలు లేకుండా స్టార్ బాక్సర్ మేరీ కోమ్‌ను ఏకపక్షంగా ఎంపిక చేసి పంపించడంపై నిజామాబాద్ జిల్లా బాక్సర్ నిఖత్ జరీన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది టోక్యోలో జరుగనున్న ఒలింపిక్స్‌లో భాగంగా చైనాలో జరిగే క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌కు 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌ను పంపడానికి బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్ పోటీలకు వెళ్లే క్రీడాకారులు మొదట స్వదేశంలో ఎంపిక పోటీల్లో పాల్గొనాలని నిఖత్ గతకొంత కాలంగా డిమాండ్ చేస్తోంది. మేరీకోమ్‌ను ఏకపక్షంగా పంపించడాన్ని నిఖత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. 

boxer

ఈ విషయమై నిఖత్ కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాశారు. నిబంధనలను తుంగలో తొక్కి, మేరీకోమ్‌ను పంపడం సరికాదని, క్రీడాకారుడిగా మీరు దీన్ని సమర్థిస్తారా అని ప్రశ్నించారు. షూటర్ అభినవ్ బింద్రా కూడా ఆమెకు మద్దతు పలికారు. దీంతో ఈ అంశమై మేరీ కోమ్ స్పందించారు. ట్రయల్ పోటీల్లో పాల్గొనడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. ఈ క్రమంలో జరీన్‌పై మేరీకోమ్‌ తీవ్రంగా ధ్వజమెత్తడం, దానికి నిఖత్‌ జరీన్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇవ్వడం జరుగుతూ వస్తున్నాయి. ఈ వివాదాన్ని పెద్దది చేయడం ఇష్టం లేని బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా.. వారి మధ్య సెలక్షన్‌ ట్రయల్‌ నిర్వహించడానికి సిద్ధమవుతోంది. మేరీకోమ్‌, జరీన్‌‌ల మధ్య పోరు నిర్వహించాలనే యోచనలో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్‌ చివరి వారంలో వీరిద్దరికీ మధ్య పోటీ నిర్వహించడానికి ప్రయత్నిస్తోంది. డిసెంబర్‌ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ ఆలిండియా బాక్సింగ్‌ లీగ్‌ జరుగనున్న తరుణంలో ఆ తర్వాత మేరీకోమ్‌-జరీన్‌లకు మెగా ఫైట్‌  ట్రయల్స్‌ ఏర్పాటు చేసేందుకు దాదాపు రంగం సిద్ధమైంది.