దేశంలో రోజురోజుకి టెక్నాలజీ ఎంతంగా పెరుగుతున్న, అంతే విధంగా మోసాలు కూడా భారీగానే జరుగుతున్నాయి. ఆన్లైన్ వ్యాపారంలో ప్రసిద్దిగాంచిన సంస్థ అమెజాన్. ఈ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సంస్థ ద్యారా మనకు కావాల్సిన ప్రతి వస్తువులను ఆన్లైన్లో బుక్ చేసుకొని తెప్పించుకుంటాము. అయితే, అమెజాన్ ద్వారా తమ కంపెనీకి చెందిన కొన్ని కోట్ల విలువైన సరుకులను గల్లంతు చేశారంటూ.. ఓ కంపెనీకి చెందిన యాజమాన్యం ఫిర్యాదు చేసిన సంఘటన సంచలనం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌లోని సీటీసీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆనందిత్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అమేజాన్ సంస్థ ద్వారా ఆన్లైన్లో కంప్యూటర్ విడి భాగాలు, ఉపకరణాల వ్యాపారం చేస్తుంటుంది. కస్టమర్ల డిమాండ్‌కు తగ్గట్టు ఆనందిత్ సంస్థ తమ ఉత్పత్తులను వివిధ ప్రాంతాల్లో ఉన్న అమెజాన్ గోదాములకు చేర్చి, అక్కడి నుంచి వినియోగదారులకు ఆర్డర్ ప్రకారం బాక్సుల రూపంలో డెలివరీ చేస్తుంటుంది. అయితే, మూడు నెలల పాటు వినియోగదారుల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో ఆనందిత్ సంస్థ లోతుగా ఆరా తీసింది. ఈ మూడు నెలల కాలంలో మొత్తం రూ.1.35 కోట్ల విలువైన 4,262 బాక్సులు, సరుకు గల్లంతైనట్లు గుర్తించారు. అమేజ్ సొల్యూషన్స్ డైరెక్టర్ రోహిత్ అగర్వాల్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్లు అనుమానించారు. దీనిపై నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు లోతైన విచారణ చేపట్టారు.