లేత కాళ్లయ్యా.. రిక్షా తొక్కుతూ 350 కి.మీ. ప్రయాణం.. - MicTv.in - Telugu News
mictv telugu

లేత కాళ్లయ్యా.. రిక్షా తొక్కుతూ 350 కి.మీ. ప్రయాణం..

May 16, 2020

bgfc

వలస జీవులు వెతలను చెప్పడానికి మాటలు చాలడం లేదు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రోడ్లన్నీ వారి కన్నీళ్లతో, చెమటతో తడిచిపోతున్నాయి. వందలమంది దారిలోనే పిట్టలా రాలిపోతున్నారు. చావో రేవో తేల్చుకుంటామని నడుస్తూనే ఉన్నారు లక్షల మంది. వంద వేల కి.మీ. అలుపెరుగని ప్రయాణాలు సాగుతున్నాయి. పెద్దలే కాదు, పిల్లలు కూడా బతుకు కాడిని భుజాన మోస్తున్నారు. 

ఈ కుర్రాడి పేరు తబ్రే ఆలం. వయసు 11 ఏళ్లు. వలసకూలీలైన తల్లిదండ్రులను, మూటాముల్లెను రిక్షాపై కూర్చోబెట్టుకుని లేత కాళ్లతో తొక్కుతూ వెళ్తున్నాడు. యూపీలోని వారణాసి నుంచి బిహార్‌లోని అరారియాకు సాగుతున్నాడు.  200 కి.మీ ప్రయాణించిన ఈ కుటుంబ పిల్లాడి కాళ్ల శక్తిని నమ్ముకుని మరో 350 కి.మీ. ప్రయాణించాల్సి ఉంది. తండ్రికి వయసైపోవడంతో ఆలం బాధ్యతను తనపై వేసుకున్నాడు. ప్రధాని మోదీ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో వీరికి బతకడం కష్టమై, కలోగంజో తాగానికి సొంతూరికి వెళ్తున్నారు. ఎర్రటి ఎండలో ఆలం ఆయాసంతో రిక్షా తొక్కుతుంటే పోలీసులు, అధికారులు చూస్తుండిపోతున్నారే తప్ప ఎలాంటి సాయమూ చేయడం లేదు.