అమ్మకు అపురూపమైన కానుకిచ్చిన 9 ఏళ్ల కుమారుడు - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మకు అపురూపమైన కానుకిచ్చిన 9 ఏళ్ల కుమారుడు

May 16, 2019

మదర్స్ డే రోజున ఓ అమ్మకు ఓ కొడుకు అపురూపమైన కానుక ఇచ్చాడు. అతని వయసు కేవలం తొమ్మిదేళ్ళే. తొమ్మిదేళ్ల బాలుడు అమ్మకు బహుమతి ఎలా ఇస్తాడని అనుకోవద్దు. ఇవాళ రేపటి పిల్లలు అల్లరితో సహా చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు అనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. తల్లిదండ్రుల పట్ల వాళ్లు కూడా చాలా ప్రేమను ప్రదర్శిస్తున్నారు. తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులతో అమ్మకు బంగారు ఉంగరం కొనిచ్చిన ఈ ఘటన చైనాలో  లింక్వాన్‌ పట్టణంలో చోటు చేసుకుంది. అతని పేరు ఇఫాన్.

takes his piggy banks to a jeweller to buy a surprise gift for his mother

మే 12న జరిగే మదర్స్ డేకు కన్నతల్లికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఆ బుడ్డోడు ఎప్పటినుంచి అనుకున్నాడో.. పైసా పైసా గల్లాపెట్టెలో పోగు చేసుకున్నాడు. ఆరోజు రానేవచ్చింది. అమ్మను మెస్మరైజ్ చేద్దామనుకున్నాడు. ‘అమ్మా నీ చేతికి ఏ ఉంగరం బాగుంటుంది’ అని సరదాగా అడిగాడు. విషయమేంటో ఆమెకు అర్థం కాలేదు. కుమారుడు అడుగుతున్నాడు కదా అని ఆమె తనకు నచ్చిన ఓ ఉంగరాన్ని చూపించారు. దాని ధరెంతో తెలుసుకున్న ఇఫాన్‌ నేరుగా బిల్‌ కౌంటర్‌ దగ్గరకెళ్లి జేబులో నుంచి రెండు పిగ్గీ బ్యాంక్‌లను గుమ్మరించాడు.

అందులోని నాణేలను లెక్కగట్టగా రూ.15 వేలు (1500 యువాన్‌లు) ఉన్నాయి. వాటితో ఆ ఉంగరాన్ని కొని అమ్మకు బహుమతిగా ఇచ్చాడు. కుమారుడు చేసిన పనికి ఆ తల్లి ఆనందంతో పొంగిపోయారు. పిల్లల నుంచి కేవలం ప్రేమ, ఆదరణ మాత్రమే ఆశిస్తారు తల్లిదండ్రులు.. అలాంటిది తమ బిడ్డ ఉంగరం బహుమతి ఇచ్చేసరికి ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

‘అమ్మ మాకోసం చాలా కష్టపడుతోంది. ఆమె ఒంటిమీద బంగారం అనేదే లేదు. అందుకే అమ్మకు ఏదైనా మంచి బహుమతి ఇద్దామని చాలా కాలం నుంచి అనుకుంటున్నాను. అమ్మ, అమ్మమ్మ ఇచ్చిన పాకెట్‌మనీని రెండేళ్లుగా పొదుపు చేసి ఈ బహుమతి కొని అమ్మకు బహూకరించాను’  అని చెప్పాడు ఇఫాన్‌. అమ్మతో పాటు అమ్మమ్మకు కూడా ఇఫాన్‌ నెక్లెస్‌ కొనిచ్చి ఆమెను మరింత ఆశ్చర్యపరిచాడు.