పాదయాత్ర అంటే రాజకీయ నాయకులు చేస్తారని మనకు తెలుసు. కానీ కర్ణాటకలో మాత్రం పెళ్లి కాని యువకులు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్కపోవడంతో పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. 30 ఏళ్ళు దాటిన సుమారు 200 మంది ప్రసాదులు మాండ్య నుంచి చామరాజనగర్ జిల్లాలోని ఎంఎంహిల్స్ దేవాలయం వరకు 105 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఫిబ్రవరి 23న ప్రారంభమయి 25న దేవాలయానికి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. అంతేకాక, దీనికి బ్రహ్మచారుల పాదయాత్ర అని పేరు కూడా పెట్టుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి దొరికేలా దీవించాలని అక్కడి దేవతకు మొక్కులు చెల్లించనున్నారు. మైసూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాండ్యలో అమ్మాయిల కొరత విపరీతంగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే యువతకు వధువు దొరకడం లేదు. అయితే గతంలో ఇక్కడ భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగేవని దాని ఫలితాన్ని ఇప్పుడు యువకులు అనుభవిస్తున్నారని స్థానిక మహిళా రైతులు చెప్తున్నారు. కాగా, పెళ్లి కోసం చేస్తున్న ఈ పాదయాత్ర దేశంలోనే తొలిసారని, చరిత్రలో ఎక్కే సంఘటన అని ఇతర ప్రాంతాల వారు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఆ యువకుల పరిస్థితి చూస్తే జాలేస్తుంది కదూ. మనమేం చేస్తాం.. అంతా కాలం చేతిలో ఉంది.