Brahmastra multilingual Bollywood movie review
mictv telugu

బ్రహ్మాస్త్ర.. బహుత్ కష్ట్ హై.. మూవీ రివ్యూ

September 9, 2022

దాదాపు అయిదేళ్ల కష్టం, రూ. 400 కోట్ల బడ్జెట్, బడా స్టార్ కాస్టింగ్, ప్రెస్టేజియస్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్.. ఇలా సినిమాపై హైప్ పెంచే అంశాలొకవైపు. బాయ్కాట్ ట్రెండ్, ప్యాండెమిక్ ఎఫెక్ట్, నెపొటిజం ట్యాగ్స్.. ఇలాంటి నెగిటివ్ ఎలిమెంట్స్ మరోవైపు. మరి ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసే బాలీవుడ్ బ్రహ్మాస్త్రాన్ని బాక్సాఫీస్ బరిలో దింపుతున్నామంటూ దాదాపు ఆరు నెలలుగా ప్రచారం చేస్తున్న మూవీ టీమ్ ఆశలు ఫలించాయా? అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉందా? అనేదిప్పుడు చూద్దాం.

రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్, డింపుల్ కపాడియా, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రహ్మాస్త్ర. పేరుకు బాలీవుడ్ మూవీనే అయినా రాజమౌళి తెలుగులో ఈ సినిమాని సమర్పించడం, దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత నాగార్జున బాలీవుడ్‌లో నటించడంతో టాలీవుడ్‌లోనూ ఈ మూవీకోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు.

అలాంటి ఈ మూవీ కథని నాలుగు ముక్కల్లో చెప్పాలంటే.. మూడు ముక్కలు కాబడ్డ బ్రహ్మాస్త్రని కాపాడే బ్రహ్మాన్ష్ సభ్యుల చుట్టూ తిరుగుతుంది కథ. అందులో ఒక భాగం ఆర్టిస్ట్ అనీష్ (నాగ్) దగ్గర, మరో భాగం సైంటిస్ట్ మోహన్ భార్గవ్ (షారుఖ్) ఉంటుంది? మూడు భాగాలను కలిపి బ్రహ్మాస్త్ర తాలూకు శక్తులు సొంతం చేసుకోవాలని మౌనీరాయ్ అండ్ విలన్ గ్రూప్ ప్రయత్నిస్తుంటారు. ఇక్కడే డీజే శివ(రణ్‌బీర్) కూడా కథలోకి దిగుతాడు. అసలు శివకి, ఇషా(అలియా)కి, బ్రహ్మాస్త్రకి సంబంధం ఏంటి? ఆ మూడో ముక్క ఎక్కడుంది? ఎలా దొరికింది? చివరికి ఎవరు దక్కించుకున్నారు? ఏంటి అనేద

కథ.
ఇక్కడ చెప్పినంత సింపుల్‌గా ఏమీ ఉండదు థియేటర్లో. రెండు గంటల నలభై నిమిషాలు కాసేపు కథతో (చెప్పాలనే ప్రయత్నంతో) కాసేపు విజువల్ ఎఫెక్ట్స్‌తో, కాసేపు ఇంకెప్పటికి అయిపోతాయో అనే అతీతశక్తుల ఫైట్స్‌తో, మధ్య మధ్యలో రావాలి కాబట్టి అలా వాటిపనవి చేసుకుపోతూ వచ్చే పాటలు, కథని మలుపు తిప్పే సదుద్దేశంతో రాసుకున్న సదరు క్యారెక్టర్ల రాకపోకల నడుమ మానసిక అలసట తెప్పిస్తూ అలా సా..గుతుంది సినిమా. అప్పుడప్పుడు అలియా, రణ్‌బీర్ లవ్ స్టోరీ ఏదో బాగుంది కదా అనిపించే లోపే.. అసలు బ్రహ్మాస్త్ర స్టోరీ ఎక్కడ? మెయిన్ కథ అది కదా అని గుర్తొస్తుంటుంది. ఎలాగూ వీళ్ల పెళ్లి వీడియోలు, రొమాంటిక్ కవర్ సాంగ్స్ పెద్దగా బైటికి రాలేదు కాబట్టి.. ఈ సినిమా సీన్స్ చూసయినా వాళ్ల ఫ్యాన్స్ ఆనందిస్తాడనుకున్నాడేమో మరి డైరెక్టర్.

దర్శకుడు అయాన్ ముఖర్జీ మీద అవెంజర్స్, మార్వల్ క్యారెక్టర్ల ప్రభావం గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక్కో పాత్రకి ఒక్కో స్పెషల్ పవర్, కష్టమొస్తే అందరూ కలిసిపోయి వంతులేసుకుని వాళ్ల శక్తుల మేర కష్టపడ్డం లాంటివి మల్టీవర్స్, మార్వల్ యూనివర్స్ లాంటివి గుర్తుచేస్తుంటాయి. మరి ఆ రేంజ్ కాకపోయినా కనీసం అలాంటి సినిమాల్ని అందరూ చూసేస్తున్నారు కాబట్టి.. గ్రాఫిక్స్ అయినా భారీ స్థాయిలో ఉందా అంటే ఓకే ఓకేనే. ఇంటర్నేషనల్ సినిమాల్ని ఇంట్రస్టింగ్‌గా చూసేస్తున్న ఇప్పటి ఆడియెన్ గొప్పగా సాటిస్ ఫై అయ్యేంత విజువల్ ఎఫెక్ట్స్ అయితే కనిపించవు.

గతంలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, రణ్ బీర్ కాంబినేషన్లో వచ్చిన వేకప్ సిద్, యే జవానీ హై దివానీ చూసినవాళ్లెవరయినా ఈ మూవీపై కూడా హోప్స్ పెట్టుకోవడం కామనే. కానీ ఆ సినిమాల్లో కనిపించే క్యారెక్టర్ల ఇంటెన్సిటీ, స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఇందులో ఏ మాత్రం కనిపించదు. అఫ్ కోర్స్.. ఈ జానర్ వేరు, కథ వేరు, కాన్సెప్ట్ వేరు. కానీ ఆడియెన్స్ కి హై ఇచ్చే ఎలిమెంట్స్ మాత్రం ఉండాల్సిందేగా. పదేళ్ల నుంచి ఇదే ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తున్నాడంటే సగటు ప్రేక్షకుడికుంచే అంచనాలుంటాయి మరి.

దాదాపు ఇరవైఏళ్ల తర్వాత నాగ్ హిందీలో రీ ఎంట్రీ ఇచ్చాడీ సినిమాతో. మాంచి మర్చిపోలేని క్యారెక్టర్ చేస్తాడనుకుంటే.. అసలు సినిమా అయిపోయాక పెద్దగా గుర్తుకూడా ఉండదాయన పాత్ర. అమితాబ్ మాత్రం పాత్రకు పూర్తి న్యాయం చేసినా స్క్రీన్ ప్లేలో ఉన్న ఫ్లాస్ సినిమాను నిలబెట్టలేకపోయాయి. మేబీ బాలీవుడ్ ఆడియెన్స్ ఏమైనా కాస్తో కూస్తో కనెక్ట్ అయే ప్రమాదం ఉందేమో గానీ.. తెలుగులో మాత్రం బహుత్ కష్ట్ హై.