Brahmin reporter asked a tough question to Nagashaurya
mictv telugu

రెడ్డి, చౌదరీలకు లేనిది బ్రాహ్మణులకే ఎందుకు? హీరోకి దిమ్మతిరిగే ప్రశ్న

September 22, 2022

నాగశౌర్య హీరోగా నటించిన ‘క‌ృష్ణ వ్రింద విహారి’ చిత్రం ఈ నెల 23న విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగశౌర్యకు ఓ రిపోర్టర్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. వివరాల్లోకెళితే.. ఈ చిత్రంలో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడి పాత్ర పోషించారు. అంతకుముందు ముగ్గురు మొనగాళ్లులో చిరంజీవి, అదుర్స్‌లో ఎన్టీఆర్, రెబల్‌లో ప్రభాస్, దువ్వాడ జగన్నాథంలో అల్లు అర్జున్ వంటి వారు బ్రాహ్మణ యువకుడి పాత్రలో నటించారు. అప్పుడు ఆయా హీరోలు బ్రాహ్మణ యువకుడిగా నటించడానికి ట్రైనింగ్ తీసుకున్నాం, బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాం, డైలాగ్ డెలివరీలో జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తారు. అలాగే నాగశౌర్య కూడా చాలా హార్డ్ వర్క్ చేశాం, అవసరాల శ్రీనివాస్ వద్ద ఎలా నడవాలో శిక్షణ తీసుకున్నాననడంతో అక్కడే ఉన్న బ్రాహ్మణ రిపోర్టర్‌కి చిర్రెత్తుకొచ్చింది.

‘హీరోగారూ బ్రాహ్మిణ్ క్యారెక్టర్ చేశా.. అవసరాల శ్రీనివాస్ వద్ద ఎలా నడవాలో నేర్చుకున్నా అంటున్నారు. బ్రాహ్మిణ్‌లు ఏమైనా ప్రత్యేకంగా నడుస్తారా? నేను అదే కులానికి చెందిన వాడిని. నేను మీలాగే నడుస్తా. ప్రత్యేకంగా ఏమీ నడవను. అలాంటప్పుడు నడక నేర్చుకున్నా, మాట నేర్చుకున్నా అంటే నాకేం అర్ధం కావట్లేదు. రెడ్డి, చౌదరి పేర్లతో సినిమాలు వచ్చాయి. వారి పాత్రల్లో నటించడానికి ప్రత్యేక ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? అప్పుడు ఎవరూ అడగలేదు. బ్రాహ్మిణ్ అనేసరికి ఎందుకలా అంటున్నారు. అందరూ కలిసి ఉంటున్నప్పుడు ఈ భేదాలు ఎందుకొస్తున్నాయి? అని కాస్త ఘాటుగా ప్రశ్నించారు. దీనికి నాగశౌర్య బదులిస్తూ ‘సార్.. బాడీ లాంగ్వేజ్ డిఫరెంటుగా ఉంటుంది. జిమ్ చేసే వాళ్ల బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. అలాగే నడకను బట్టి కమ్యూనిటీని చెప్పవచ్చు. ఎన్టీఆర్ బ్రాహ్మిణ్‌గా చేసినప్పుడు అలాగే చెప్పారు. పుష్పలో అల్లు అర్జున్ తెలుగు భాషే అయినా చిత్తూరు యాసలో మాట్లాడారు. ఎందుకంటే వారిని మెప్పించడం కోసం. నేను బ్రాహ్మిణ్ పాత్ర చేసింది వాళ్లను మెప్పించడానికే. పాత్రకు తగ్గట్టు హావభావాలు, శరీర ప్రవర్తన ఉంటుంది. దీన్ని మిమ్మల్ని మెప్పించడానికే చేశాను తప్పితే ఇందులో కమ్యూనిటీ ఇష్యూ కాదు’ అని స్పష్టం చేశారు.