గొడ్డళ్లతో బ్రాహ్మణుల ర్యాలీ.. పాల్గొన్న కేంద్ర మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

గొడ్డళ్లతో బ్రాహ్మణుల ర్యాలీ.. పాల్గొన్న కేంద్ర మంత్రి

April 16, 2018

దేశరాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న నోయిడాలో బ్రాహ్మణులు ఆదివారం హల్చల్ చేశారు. గొడళ్లు, తుపాకులు, ఈటెలు, లాఠీలు, కాషాయ జెండాలు చేతబట్టి ఆగ్రహంతో ర్యాలీ నిర్వహించారు. బ్రాహ్మిణ్ ఏక్తా మంచ్ పేరుతో బలప్రదర్శన చేశారు. కేంద్ర మంత్రి మహేశ్ శర్మ స్వయంగా దీన్ని ప్రారంభించారు. ఆయన కూడా గొడ్డలి పట్టుకున్నారు. కశ్మీర్‌లో ముస్లిం బాలికపై గ్యాంగ్ రేప్ హత్య కేసులో బ్రాహ్మణులైన నిందితులు అరెస్ట్ కావడం, ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యేను జైలుకు పంపిన నేపథ్యంలో ఈ అగ్రవర్ణాల వ్యక్తులు ర్యాలీ నిర్వహించారు.

మోటార్ బైకులు, ఎస్యూవీ వాహనలతో రోడ్లపై నినాదాలు చేస్తూ వెళ్లారు. రోడ్లను దిగ్బంధించారు. నాలుగు వేల యేళ్ల చరిత్ర ఉన్న బ్రాహ్మణ సంప్రదాయాలను కాపాడుకోవడానికే ఈ ర్యాలీ చేశామని ఒక ఆందోళనకారుడు చెప్పారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చట్టాల ప్రకారం.. 5 అంగుళాలకు మంచిన ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించకూడదు(సిక్కులకు మినహాయింపు ఉంది). ప్రజల్లో భయోత్పాతం సృష్టించడానికి మోదీ ప్రభుత్వ అండతో ర్యాలీ చేశారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అగ్రవర్ణాలు భారత్ బంద్ నిర్వహించారని, అయితే దానికి స్పందన రాకపోవడతో ఇలా భయపెట్టే ప్రదర్శనకు తెరతీశారని పేర్కొన్నాయి.