డీఆర్‌డీవో మరో విజయం.. బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగం - MicTv.in - Telugu News
mictv telugu

డీఆర్‌డీవో మరో విజయం.. బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగం

October 18, 2020

BrahMos successfully test-fired.jp

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. బ్రహ్మాస్‌ క్షిపణుల సామర్థ్యం పెంచేందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్(డీఆర్‌డీవో) సంస్థ గత కొన్ని రోజులుగా ప్రయోగాలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలో ఈరోజు డీఆర్‌డీవో సంస్థ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని కోల్‌కతా శ్రేణి డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధ నౌక నుంచి విజయవంతంగా పరీక్షించారు. అరేబియా మహాసముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదించినట్లు డీఆర్‌డీవో ప్రకటించింది. 

ఈరోజు ప్రయోగానికి వినియోగించిన ఐఎన్‌ఎస్‌ చెన్నై 2016వ సంవత్సరం నుంచి తన సేవలు అందిస్తోంది. ఇండియన్‌ నేవీ ప్రాజెక్టు 15Aలో భాగంగా దీనిని అభివృద్ధి చేశారు. అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ దీనిని జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ చెన్నై 164 మీటర్ల పొడవు, 7500 టన్నుల బరువు ఉంటుంది. ఇది రెండు మల్టీరోల్ కాంబాట్ హెలికాప్టర్లను తీసుకెళ్లగలదు. గంటకు 30 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. బ్రహ్మోస్, బరాక్-8 క్షిపణులు, యాంటీ సబ్‌మెరైన్ ఆయుధాలు, సెన్సార్లు, భారీ టోర్పెడో ట్యూబ్ లాంచర్లు, రాకెట్ లాంచర్లు ఈ యుద్ధ నౌకలో ఉంటాయి.