ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాలు, ఇతర సామాగ్రి చోరీలకు గురి అవుతూనే ఉన్నాయి. ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ రథంలోని వెండి సింహాల మాయం ఘటనను మర్చిపోకముందే మరో వివాదం చెలరేగింది. విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న ఆలయంలోని ఇత్తడి కానుకలు కనిపించకుండా పోయాయి. దీంతో ఆలయంలో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఈ విషయం బయటకు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే వాటి ఆచూకీ తేల్చాలని నిర్ణయించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
కొన్ని రోజులుగా సింహాచలం అప్పన్నకు వచ్చిన కానుకల్లోని దాదాపు 550 కేజీల ఇత్తడి కానుకల వివరాలు తెలియడం లేదు. దీంతో అవి ఎవరో తీశారని ఆలయ సిబ్బంది భావిస్తున్నారు. దీని వెనక ఇంటి దొంగల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సహకారంతోనే ఇవి బయటకు వెళ్లి ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ విషయం తెలియడంతో భక్తులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. ఆలయాల్లో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోషులను గుర్తించి కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు.