చావుపుట్టుకలు ఏ ప్రాణికైనా సహజమే. పుట్టినవాడు గిట్టక చావడు. ఈ సత్యం అందరికీ తెలిసిందే అయినా ఆప్తుల మరణాలు చాలా బాధపెడతాయి. ఒక మనిషి పోతే మిత్రులే కాదు, శత్రువులు కూడా కడసారి చూపుకు వెళ్లడం మామూలే. కొందరి అంత్యక్రియలు వేల మందితో ఘనంగా జరిగితే కొందరి అంతియ యాత్రకు ఇద్దరు ముగ్గురు కూడా రారు. బ్రెజిల్‌లోని సావోపాలోకు చెందిన బాల్తజార్ లెమోస్ అనే 60 ఏళ్ల వృద్ధుడికి ఇదంతా ఏమిటని అనిపించింది. అతడు అంత్యక్రియల నిర్వాహకులు కావడమే దీనికి కారణం వేల అంత్యక్రియలు నిర్వహించిన లెమోస్‌కు తను చస్తే అంత్యక్రియలకు ఎంతమంది వస్తారనే పిచ్చి ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా నాటకానాకి తెరతీశాడు.
తొలుత తను అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యానని సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు. జనం ఎప్పట్లాగే, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం అని మెసేజీలు పెట్టి సరిపెట్టుకున్నారు. లెమోస్ నవ్వుకుని, తన చనిపోయినట్లు ఫేక్ వార్త పోస్ట్ చేశాడు. బంధుమిత్రులు బోలెడు దుఃఖంతో రిప్ అని మెసేజీలుపెట్టి అంత్యక్రియల కోసం ఎదురు చూశారు. లెమోస్ ఇంట్లో కనిపించకపోవడంతో 80 ఏళ్ల దాటిన తల్లితోపాటు కుటుంబసభ్యుడు బంధువులు తికమకపడ్డారు.
ఓ బంధువు ఆస్పత్రికి వెళ్లి వాకబు చేశారు. లెమోస్ అనే పెద్దమనిషి తమ ఆస్పత్రికి అసలు రాలేదని అక్కడి సిబ్బంది చెప్పారు. మొత్తానికి ఓ చర్చిలో అంత్యక్రియలని సమాచారం చేరవేశాడు లెమోస్. అందరూ బరువెక్కిన గుండెలతో అక్కడికి చేరుకున్నాడు. ఉన్నట్టుండి అతని గొంతు వినిపించడంతో ఠారెత్తిపోయారు. బహుశా బతికి ఉన్నప్పుడు తమ కోసం రికార్డు చేసిన ఆడియోనేమో అనుకుని సరిపెట్టుకున్నారు.
ఆ తర్వాత లెమోస్ ఓ గది తలుపు తెరుచుకుని దెయ్యంలా ప్రత్యక్షం కావడంతో హాహాకారాలు చెలరేగాయి. కొందరు సంబరంతో కౌలిగించుకుంటే, కొందరు భయంకరంగా తిట్టిపోశారు. ‘‘బ్యాడ్ టేస్టురా నీది. నీ కోసం ఓ పూటంతా అనవసరంగా బాధపడ్డాం. ఇప్పుడు నువ్వు బతికున్నా మావరకు చచ్చినోడితోనే సమానం’’ అని ముఖాలు మాడ్చుకుని వెళ్లిపోయారు. కొందరైతే, లెమోస్ నిజంగా చనిపోయినా అంత్యక్రియలకు హాజరయ్యే ప్రసక్తే లేదని, ఇప్పుడు వచ్చాం కనుక అప్పుడు రాకపోయినా చెల్లువేసుకోవచ్చని కడిగిపారేశారు.