రిపబ్లిక్ డేకు బ్రెజిల్ అధ్యక్షుడా? అతని నోటినిండా రేప్, సెక్స్! - MicTv.in - Telugu News
mictv telugu

రిపబ్లిక్ డేకు బ్రెజిల్ అధ్యక్షుడా? అతని నోటినిండా రేప్, సెక్స్!

January 25, 2020

Brazilian President.

ఢిల్లీలో రేపు జరుగనున్న 71వ గణతంత్ర వేడుకలకు బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సోనారో ప్రత్యేక అతిథిగా రానున్నారు. ఈరోజు ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు. బొల్సోనారో భారత్‌లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో వారు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. కాగా భారత గణతంత్ర వేడుకలకు బ్రెజిల్‌ అధక్షుడు ప్రత్యేక అతిథిగా విచ్చేయడం ఇది మూడోసారి. 2004లో తొలిసారిగా బ్రెజిల్‌ అధ్యక్షుడు రిపబ్లిక్‌ డేకు హాజరైన విషయం తెలిసిందే.

అయితే జైర్‌ బొల్సొనారో గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆయనకు మహిళల పట్ల గౌరవం లేకపోవడమే ఇందుకు కారణం. జైర్‌ బొల్సొనారో అనేక సార్లు మహిళలను కించపరిచేలా ప్రవర్తించారు. తాజాగా ఆదివారం బోల్సొనారో మద్దతుదారుడొకరు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మెక్రాన్‌ భార్య బ్రిగెట్టి ఆకారాన్ని కించపర్చేలా  సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. బ్రెజిల్‌ అధ్యక్షుడి భార్య మిషెల్లీ అంత అందంగా బ్రిగెట్టీ ఉండదని వ్యాఖ్యానించారు. దీనికి మరో వ్యక్తి ‘ఇప్పుడు అర్థమైంది మెక్రాన్‌ బొల్సొనారోను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడో’ అని కామెంట్‌ పెట్టారు. సాధారణంగా ఇటువంటి పోస్టులను ఉన్నత స్థాయిలో ఉన్న నేతలు ఖండిస్తారు. కానీ, బొల్సొనారో చేసిన కామెంట్ మాత్రం వీటిని మరింత ప్రోత్సహించేలా ఉంది. ‘ఆయన్ను వేధించొద్దు.. హా.. హా’ అంటూ పోస్టు పెట్టారు. ఈ పోస్టు చూసి తమ అధ్యక్షుడికి ఇది సరదాగా ఉందా అని బ్రెజిల్‌ వాసులే నిర్ఘాంతపోయారు. 

బొల్సొనారో వ్యాఖ్యలకు నొచ్చుకొన్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మెక్రాన్‌ చాలా హుందాగా స్పందించారు. ‘బ్రెజిల్‌ మహిళలు తమ అధ్యక్షుడి వ్యాఖ్యలు చూసి సిగ్గుపడతారు. బ్రెజిలియన్లు గొప్పవారు. ఇటువంటి ప్రవర్తన వారిని తలెత్తుకోనీయకుండా చేస్తుంది. ఆ దేశ ప్రజల స్నేహశీలత, మర్యాద తెలుసు. వారికి త్వరలోనే మంచిగా ప్రవర్తించే అధ్యక్షుడు లభిస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. గతంలో 2014లో కూడా జైర్‌ బొల్సొనారో ఎంపీగా ఉన్నప్పుడు విపక్షనేత మరియా రోజారియోపై అసభ్య వ్యాఖ్యలు చేశాడు. ‘నేను నిన్ను రేప్ చేయను. నీకు రేప్ చేయించుకునే అర్హత లేదు. నోరు మూసుకొని కూర్చో.’ అని అన్నాడు.  ఆమె అందవికారంగా ఉంటుందని కూడా దుర్భాషలాడాడు. స్వలింగ సంపర్కులపై కూడా ఆయన అసభ్య వ్యాఖ్యలు చేశారు. ‘ఇద్దరు మొగాళ్ళు రోడ్డుపై ముద్దు పెట్టుకుంటే. వాళ్ళను చావకొడుతా’ అని హెచ్చరించాడు.