బ్రెజిల్ సాకర్ దిగ్గజం పీలే (82 ) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా పెద్ద పేగు క్యాన్సర్ తో బాధపడతున్న ఆయన గత అర్థరాత్రి మరణించారు.ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం సందర్భంగా ఫుట్‌బాల్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీలే మృతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులతోపాటు క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళలర్పిస్తున్నారు. రెండు దశాబ్దాలపాటు సాకర్ అభిమానులను ఉర్రూతలూగించిన పీలే.. మూడు ప్రపంచకప్ విజయాల్లో భాగస్వామి అయిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 1958, 1962, 1970లలో ప్రపంచకప్‌లు అందుకున్నాడు. ప్రపంచకప్‌లలో 14 మ్యాచుల్లో 12 గోల్స్ సాధించాడు.
పీలే పూర్తి పేరు ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో. ఆయన 17 సంవత్సరాల వయస్సులోనే గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు..21 ఏళ్ల తన సుదీర్ఘ ఫుట్‌బాల్ కెరీర్లో పీలే 1,363 మ్యాచ్‌లు ఆడి 1,281 గోల్స్ సాధించాడు. ప్రపంచంలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా ఇప్పటికీ ‘పీలే’ నే ఉన్నాడు. ఇందులో 77 గోల్స్ తన దేశం బ్రెజిల్ తరఫున ఆడుతూ సాధించినవి. పీలే బ్రెజిల్ తరఫున మొత్తం 92 మ్యాచ్‌లు ఆడారు. 1966లో ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా, మళ్లీ జట్టులోకి వచ్చి 1970 ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా ‘గోల్డన్ బాల్’ అవార్డు అందుకున్నాడు. 1971లో యుగోస్లేవియాతో చేరి చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2000 సంవత్సరంలో ఫిఫా.. పీలేను ఆ శతాబ్దపు అత్యుత్తమ ఆటగాడిగా ప్రకటించింది.
పీలే అంత్యక్రిలను మంగళవారం(జనవరి 3) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం పీలే భౌతికకాయాన్ని ఆసుపత్రి నుంచి క్లబ్ ఎస్టాడియో అర్బానో కాల్డెయిరాకు తరలిస్తారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం పీలే శవపేటికను పిచ్ మధ్యలో ఉంచుతారు. మంగళవారం పీలే కుటుంబ ప్రైవేట్ సమాధి వద్దకి సావో పాలోలోని శాంటోస్ వీధుల మీదుగా ఊరేగింపు ఉంటుంది.