రెండు జిల్లాల్లో ‘వాల్మీకి’ విడుదలకు బ్రేక్ - MicTv.in - Telugu News
mictv telugu

రెండు జిల్లాల్లో ‘వాల్మీకి’ విడుదలకు బ్రేక్

September 19, 2019

Break the release of the Valmiki movie in two districts 

శుక్రవారం విడుదలకు సిద్ధం అవుతున్న ‘వాల్మీకి’ సినిమా పేరును మార్చాలంటూ గత కొద్ది రోజులుగా బోయ కులస్తులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను అనంతపురం, కర్నూలు జిల్లాల్లో విడుదల చేయవద్దని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఆదేశాలను ధిక్కరించే థియేటర్‌ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో అత్యధిక సంఖ్యలో వాల్మీకి, బోయ సామాజిక వర్గాలు, సంఘాలు ఈ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నందున కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కర్నూలు జిల్లాలో వాల్మీక, బోయ సామాజిక వర్గాల అభ్యర్థన నేపథ్యంలో వాల్మీకీ విడుదలను నిలిపివేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశాలు జారీచేశారు. 

ఈమేరకు రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, మరియు కర్మాగారాలు శాఖ మంత్రి జయరాములు గురువారం జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. కాగా, ఈ సినిమా టైటిల్‌ తమను కించపరిచే విధంగా ఉందని, వాల్మీకి పేరును మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై విచారిస్తున్న న్యాయస్థానం డీజీపీ, సెన్సార్‌ బోర్డు, ఫిలిం ఛాంబర్‌లతో పాటు హీరో వరుణ్‌ తేజ్‌కు, చిత్రయూనిట్‌కు నోటీసులు పపించింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.