వారంతా వివాహానికి వెళ్లారు. పెళ్లి సందడి పూర్తయ్యాక ఆటోలో తిరిగి పయనమయ్యారు. పెళ్లి విషయాలు, భోజనాలు గురించి సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనే సమయంలో విధి వక్రీకరించింది. లారీ రూపంలో వచ్చిన మృత్యువు వారిని కాటేసింది. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
కొమరాడ మండలం చోళపదం వద్ద ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా కొమరాడలోని అంటివలస గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. తుమ్మవలస పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది.