కేసీఆర్ బతికి ఉండే వరకు రైతు బంధు, రైతు బీమా ఆగదని సీఎం కేసీఆర్ తెలిపారు.తెలంగాణ రైతాంగం అద్భుతమైన రైతుగా తయారయ్యేవరకు కృషి చేస్తానని హామి ఇచ్చారు. మరో 10 రోజుల్లోనే రైతులకు రైతు బంధు నిధులను విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. జగిత్యాల జిల్లా పర్యటించిన ఆయన కొత్త కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. మెడికల్ కాలేజీ భవనానికి కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని కేసీఆర్ ప్రసంగించారు. శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతుబంధుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నామన్నారు.ఈ భూ ప్రపంచంలో రైతుబంధు, రైతు బీమా ఇచ్చే రాష్ట్రం మరొకటి లేదన్నారు. చితికిపోయి, ఛిద్రమైన రైతుల బతుకులు బాగుపడాలని రైతుబంధు, రైతు బీమా అందిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ధాన్యం కొంటున్నామని వివరించారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్రజల ఆశీస్సులును సీఎం కేసీఆర్ కోరారు.భారత రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలన్నారు. భారతదేశ భవిష్యత్ గురించి, బాగుపడటం కోసం ఈ దేశం పిడికిలి ఎత్తాలి.. మన ఆస్తులను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. గోల్ మాట్ గోవిందం గాళ్లు, కారుకూతులు కూసేవాళ్లు తిరుగుతున్నారని..వాళ్ల మాటలు నమ్మితే మునిగిపోయే ప్రమాదం ఉందని కేసీఆర్ వాఖ్యానించారు. మోడీ వచ్చిన తర్వాత ఒక్క మంచి పనైనా జరిగిందా ? అని ప్రశ్నించారు. మేకిన్ ఇండియా అని డైలాగులు చెప్పే మోడీ హయాంలో కంపెనీలు వెనక్కు పోయాయని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని మండిపడ్డారు. ఎల్ఐసీని సైతం అమ్మేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సొత్తును వ్యాపారులకు కట్టబెడుతున్న మోడీపై పోరుకు భారతదేశం పిడికిలి ఎత్తాలి అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి :మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్