Breaking: Students ... you got ten results
mictv telugu

బ్రేకింగ్: విద్యార్థుల్లారా..పది ఫలితాలు వచ్చేశాయ్

June 30, 2022

తెలంగాణ వ్యాప్తంగా పదోవ తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు శుభవార్తను చెప్పారు. కాసేపటిక్రితమే పదోవ తరగతి పరీక్షల ఫలితాలను ఆమె విడుదల చేశారు. ఈ ఏడాది పదోవ తరగతి పరీక్షల్లో 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఈ ఫలితాల్లో బాలికలే పైస్థాయిలో ఉన్నారని ఆమె అన్నారు. బాలికలు 92.45 శాతం, బాలురు 87.16 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థిని, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ bie.telangana.gov.in, bseresults.telangana.gov.inలో ఫలితాలను చెక్ చేసుకోవాలని కోరారు.

అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..”ఈరోజు విడుదలైన పది ఫలితాల్లో 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో బాలికలే పై స్థాయిలో ఉన్నారు. బాలికలు 92.45 శాతం, బాలురు 87.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక, ఈ టెన్త్ ఫలితాలలో సిద్దిపేట జిల్లా 97 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. 79 శాతంతో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. 15 స్కూల్స్‌లో ఒక్కరూ కూడా పాస్‌ అవలేదు. 3,007 పాఠశాలల్లో 100 మంది విద్యార్థులు మాత్రమే పాస్‌ అయ్యారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం” అని ఆమె అన్నారు.

మరోపక్క తెలంగాణలో ఈ ఏడాది 5,09,275 మందికి పదోవ తరగతి పరీక్షలు నిర్వహించగా, అందులో 99 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మే 23 నుంచి జూన్‌ ఒకటోవ తేదీ వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. కరోనా కారణంగా 2022లో పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో నేడు ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.