తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 14వ తేదీన జరగాల్సిన ఎంసెట్ పరీక్షకు సంబంధించి, ఉన్నత విద్యా మండలి అధికారులు విద్యార్థులకు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నామని కాసేపటిక్రితమే ప్రకటించారు. కావున విద్యార్థినీ, విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త తేదీని ప్రకటించేవరకు పరీక్షకు సన్నద్దం కావాలని సూచించారు.
ఉన్నత విద్యా మండలి నిర్ణయం ప్రకారం..” రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నాం. ఈనెల 18 నుంచి 20 వరకు జరగాల్సిన ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా ఉంటుంది. గతవారం రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈరోజు ఉదయం నుంచి ఎంసెట్ పరీక్ష నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించాం. ఈ నెల 14, 15 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో మా నిర్ణయాన్ని ప్రభుత్వంతో చర్చించి అనంతరం ఈ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నాం. ఇంజినీరింగ్ పరీక్షను మాత్రం యథాతథంగా జరపాలని నిర్ణయించాం” అని ఉన్నతాధికారులు తెలిపారు.