బ్రీత్‌- ఇన్ టూ ది షాడోస్ 2 రివ్యూ - MicTv.in - Telugu News
mictv telugu

బ్రీత్‌- ఇన్ టూ ది షాడోస్ 2 రివ్యూ

November 10, 2022

అభిషేక్ బచ్చన్‌, నిత్యామీనన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రీత్‌- ఇన్ టూ ది షాడోస్ ఫస్ట్‌ సీజన్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఎపిసోడుకొక సస్పెన్స్‌ ఎలిమెంట్‌తో సస్పెన్స్‌, డ్రామా, ఎమోషన్స్‌, సెంటిమెంట్స్‌ అన్ని కుదరడంతో పాజిటివ్ టాక్‌ దక్కించుకుంది. మరి లేటెస్ట్‌గా 8 ఎపిసోడ్ల కంటెంట్‌తో అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైన సీజన్‌ 2 ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాల్ని అందుకోగలిగిందా? సీజన్‌ 1 ని మించి అలరించగలిగిందా ఇప్పుడు చూద్దాం.

సింపుల్‌గా కథ ఇదీ..

బ్రీత్ గత సీజన్‌ ముగిసిన చోటే సరిగ్గా సెకండ్ సీజన్ ప్రారంభమవుతుంది. తనకున్న మెంటల్‌ డిజార్డర్‌తో నలుగురిని చంపిన అవినాష్ అలియాస్‌ జే(అభిషేక్ బచ్చన్) ని మెంటల్ అసైలమ్‌‌లో మూడేళ్లపాటు ట్రీట్మెంట్ కోసం ఉంచుతారు. పరిస్థితులు మెల్లిగా చక్కబడుతున్నాయనుకుంటున్న టైమ్‌లో విక్టర్ (నవీన్ కస్తూరియా) అసైలమ్‌ నుంచి అవినాష్‌ను తప్పించుకోడానికి సాయం చేస్తాడు.

Breathe Into The Shadows, Season 2, review, Abhishek Bachchan, Amit Sadh, show is a predictable plod

ఫస్ట్‌ సీజన్‌లో తను చంపాలనుకునేవాళ్లని పదితలల రావణాసురుడితో పోలుస్తూ పథకం ప్రకారం నలుగురిని చంపేయగా, ఇప్పుడు మరో ఆరుగురుని చంపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడా? అనుకున్నట్టుగానే అందర్నీ చంపేశాడా? ఈ క్రమంలో తన ఫ్యామిలీ ఎదుర్కొన్న సమస్యలేంటి? అసలు విక్టర్‌ ఎవరు? అవినాష్‌ని ఎందుకు తప్పించాడు? చివరిగా అవినాష్‌ అలియాస్‌ జే పోలీసులకు పట్టుబడ్డాడా ? ఇవన్నీ సీజన్ 2లో 8 ఎపిసోడ్లుగా సాగిన కథ.

కథనం, కట్టిపడేసే అంశాల విషయానికొస్తే..

ఈ సీజన్‌కి దర్శకత్వంతో పాటు స్టోరీ, స్క్రీన్‌ ప్లేని అందించిన మయాంక్‌ శర్మ ఆడియెన్స్‌ని సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌ తో సర్ ప్రైజ్‌ చేయడంలో కొంతవరకే సక్సెసయ్యాడు. ఫస్ట్‌ సీజన్‌కి కూడా కథ రాయడంతో పాటు డైరెక్షన్‌ కూడా మయాంక్ శర్మే చేసినా ఈసారి మాత్రం గత సీజన్‌ అంతలా ఇంపాక్ట్ క్రియేట్‌ చేయలేకపోయాడనే చెప్పాలి. నిజానికి కొన్ని ట్విస్టులు అక్కడక్కడా బాగానే ఉన్నా చాలా చోట్ల ఇంకొన్ని సీన్లని ఈజీగా ప్రెడిక్ట్‌ చేస్తారు ప్రేక్షకులు. మొదటి సీజన్ అంతగా జనాలకి నచ్చడానికి కారణమైన డ్రామా అండ్ మిస్టరీని ఈ సీజన్‌లో కన్వీన్సింగ్‌గా చూయించడంలో పెద్దగా సక్సెస్ కాలేదు. అవినాష్‌కున్న మెంటల్‌ డిజార్డర్, తనలోనే జే ఉన్నాడన్న తాలూకు కాంట్రాస్ట్‌‌ని ఫస్ట్ సీజన్‌లో చూయించినంత గ్రిప్పింగ్‌‌గా ఈ సీజన్‌ స్క్రీన్‌ ప్లేలో చూయించలేదు. కొన్నిసార్లు స్క్రిప్ట్‌ ఎగ్జిగ్యూషన్ స్పీడ్‌గా వెళ్తుండడం వల్ల అసలేం జరుగుతోందో తెలీని డైలామా చాలా సీన్లలో ఫీలవుతాం.

ఇక నిత్యామీనన్‌ కూడా కొన్ని నిమిషాల కిందే మనుషుల్ని చంపడం తప్పు అన్నట్టుగా ఉండి, మళ్లీ కాసేపటికే కుటుంబం కోసం చంపేయొచ్చు అన్నట్టుగా మారుతుండడం అర్థం కానట్టనిపిస్తుంది. ఒకర్ని చంపడానికి తను పడే స్ట్రగుల్ అంటూ పెద్దగా కన్వీన్సింగ్‌గా ఎక్కడా అనిపించదు. ఇక సీజన్‌ మొత్తంలో సింగిల్ అటెంప్టులోనే మర్డర్‌ చేసి తప్పించుకుంటున్నా, ఈ కాలంలో అడుగుకో సీసీ కెమెరాలంటూ ఒకటుంటాయన్న లాజిక్‌ చాలా చోట్ల పనిచేయదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌ గొప్ప ఇంట్రస్టింగ్‌గా అనిపించకపోగా ఇంత చిన్న లాజిక్స్‌ ఎలా మిస్సవుతున్నారంటూ ఆడియెన్స్‌ క్వశ్చన్‌ చేసేలా ఉంటాయి. కొన్ని మర్డర్ల వెనకున్న కారణాలు కూడా పెద్దగా జస్టిఫై అనిపించవు. దాంతో ఎమోషనల్ యాంగిల్ కూడా లోపించినట్టు అనిపిస్తుంది.

నటీనటుల పనితీరు

అవినాష్‌, జే రెండు పాత్రల్లోనూ అభిషేక్‌ తన శక్తిమేర బాగానే చేశాడు. నిత్యామీనన్ పాత్రకికూడా పెద్దగా ఆకట్టుకునే స్కోప్ లేకపోయింది. ఇక ఈ సీజన్లో సర్ ప్రైజింగ్‌గా తన నటనతో ఆకట్టుకున్నాడు నవీన్‌ కస్తూరియా. ట్రైలర్‌ చూసినప్పటి నుంచే సెకండ్ సీజన్‌లో ఆ పాత్ర బలమైందే అన్న ప్రేక్షకుల అంచనాల్ని మ్యాచ్‌ చేయగలిగాడు. అమిత్ సాద్ కూడా ఆఫీసర్‌గా గత సీజన్లలో లాగానే సెటిల్డ్‌ యాక్టింగ్ చేసుకుంటూ పోయినా పాత్రపరంగా అంతగా ఏమీ ప్రభావముండదు.

మొత్తంగా ఎలా ఉందంటే..

సీజన్‌ 2 ఓవరాల్‌గా ఓకే అనిపించినా, ప్రెడిక్ట్ చేయగలిగే సీన్లు, ఎమెషనల్ డెప్త్ లోపం, కన్వీనియంట్ రైటింగ్ లేకపోవడం వల్ల పర్వాలేదనిపిస్తుంది. ఫస్ట్‌ సీజన్ ని ఎలా కంటిన్యూ చేశారు? అక్కడ ఆగిన కథని ఎలా ముందుకు నడిపారు? అని తెలుసుకోడానికి పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా ఓ లుక్కేయొచ్చు. ఇక క్రైమ్‌ థ్రిల్లర్ సిరీస్‌ నచ్చే ఆడియెన్స్‌ అయితే ఓసారి అలా సింపుల్ గా చూసేయొచ్చు.