పీటల మీదపెళ్లి ఆగిపోవడం చాలా చూసే ఉంటాం. సినిమాల్లో అయితే ఇంకా బాగా చూపిస్తారు. రీల్ లైఫ్ లో బాగుంటుంది కానీ రియల్ లైఫ్ లోనూ ఇలాంటి జరుగుతుంటాయి. పెళ్లి నిలిచిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ముఖ్యంగా కట్నం విషయంలో చాలా పెళ్లిలు మధ్యలోనే ఆగిపోతాయి. కట్నం ఎక్కువ డిమాండ్ చేసి వరుడు పెళ్లికి నిరాకరిస్తుంటాడు. కానీ లేటెస్టుగా హైదరాబాద్ మేడ్చల్ లో జరిగిన ఈ ఘటన చూస్తే ఆశ్చర్యపోతారు. కట్నం సరిపోలేదని వధువు పెళ్లికి నిరాకరించింది. పెళ్లికూతురు ప్రవర్తన చూసి అక్కడున్నవాళ్లంతా ముక్కునవేలేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్లితే…మేడ్చల్ జిల్లా పోచారానికి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. సాధారణంగా అమ్మాయి వాళ్లు అబ్బాయి కట్నం ఇస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. అమ్మాయికే రెండు లక్షల కట్నం ఇచ్చేందుకు అబ్బయివాళ్లు అంగీకరించారు. అమ్మాయికి కట్నం డబ్బులు ముట్టజెప్పారు. ముహుర్తం సమయానికి డబ్బులు ఇచ్చేశారు. అమ్మాయి, అబ్బాయి తరపువాళ్లంతా పెళ్లిమండపానికి వచ్చారు. గురువారం రాత్రి పెళ్లి జరగాలి. ఇంతలో వధువు ఊహించని షాకిచ్చింది. వరుడు కుటుంబం ఇచ్చే కట్నం సరిపోలేదని..అదనంగా కట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన వరుడు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాలను పిలిచి మాట్లాడినా ఎలాంటి ఫలితం లేదు. వరుడు కుటుంబం ఇచ్చిన రెండు లక్షల రూపాలయలు వారికి ఇచ్చేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఇరుగుపొరుగువారు ఇదెక్కడి విచిత్రం అంటూ అశ్చర్యపోయారు.