పెళ్లికి ముందే అనుకున్న కట్నం డబ్బులు పెళ్లి సమయానికి చేతుల్లో పడకపోవడం, ఒకవేళ ఇచ్చినా.. సరిపోలేదన్న వంకతో ఆ వివాహాన్ని రద్దు చేసుకున్న వరుడు, వరుడి కుటుంబ సభ్యుల గురించి ఇప్పటివరకూ విన్నాం, చూశాం. కానీ, ఓ చోట మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. తనకు కట్నం సరిపోలేదని పెళ్లికూతురే పెళ్లికి గంట ముందు వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుంది. దీంతో పెళ్లికి వచ్చిన వారంతా ఔరా అంటూ ఆశ్చర్యపోయారు. అప్పుడెప్పుడో వచ్చిన జంబ లకిడి బంబ సినిమాలోని ఓ సీన్ ను తలపిస్తున్న ఈ ఘటన మన రాష్ట్రంలోనే మేడ్చల్ మల్కాజ్ గిరి ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన ఓ యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. అమ్మాయిల కొరత ఉండడంతో.. అబ్బాయి తరఫు వారే అమ్మాయికి రూ.2 లక్షలు కట్నం ఇచ్చేలా కులపెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది. దీంతో గురువారం రాత్రి వివాహానికి నిశ్చయమైంది. ముహూర్తం ఏడు గంటల 21 నిమిషాలు. ఘట్‌కేసర్‌లోని ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్లి వేదికగా నిర్ణయించారు. ఈ మేరకు పెళ్లి పత్రికలు ముద్రించి అందరికీ పంచుకున్నారు.
ముహూర్తం టైమ్ కన్నా ముందే అబ్బాయి, కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి, వారి కుటుంబసభ్యులు రాకపోవడంతో వరుడి తరఫు వారు ఆరాతీశారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని ఆ పెళ్లి కూతురు డిమాండ్ చేసింది. సరిగ్గా మరో గంటలో పెళ్లనగా.. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పేసింది. షాకైన పెళ్లి కొడుకు కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ అమ్మాయి కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. తొలుత ఇచ్చిన రూ.2 లక్షలు సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.