Bride collapses to death on stage while marriage underway in Visakhapatnam
mictv telugu

జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు మృతి

May 12, 2022

Bride collapses to death on stage while marriage underway in Visakhapatnam

వేదమంత్రాలు, పెళ్లిమేళాలతో మారుమ్రోగుతున్న ఆ వివాహ వేడుకలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. ముహూర్త సమయంలో పెళ్లి పీటలపైనే వధువు కన్నుమూసింది. ఈ ఘటన విశాఖపట్నంలోని మధురవాడలో చోటుచేసుకుంది. పెళ్లి తంతూ కూడా పూర్తి కావచ్చిన సమయంలో అనుకోని ఘటన జరగడంతో అంతా షాక్‌లోనే ఉండిపోయారు.

మధురవాడకు చెందిన శివాజీ-సృజనల వివాహం నిన్న(బుధవారం) రాత్రి 7 గంటలకు జరగాల్సి ఉంది. ముహూర్తం సమయానికి వధూవరులిద్దరూ పెళ్లి పీటలెక్కారు. వరుడు.. వధువు తలపైన జీలకర్ర బెల్లం పెడుతుండగా ఆమె సృహ కోల్పోయింది. ఒక్కసారిగా ఆమె పీటలపైనుంచి కింద పడిపోవడంతో అప్రమత్తమైన కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆస్పత్రికి తరలించేలోపే వధువు సృజన తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. వివాహ నేపథ్యంలో సృజన గత రెండు రోజులుగా పెళ్లి కూతురు అలసటకు గురై నీరసించిందని బంధువులు తెలిపారు. కానీ ఇలా ప్రాణాలు కోల్పోతుందని భావించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.