తాళి కడుతుండగా కుప్పకూలిన మరో వధువు.. ఆఖరిలో ట్విస్ట్‌ - MicTv.in - Telugu News
mictv telugu

తాళి కడుతుండగా కుప్పకూలిన మరో వధువు.. ఆఖరిలో ట్విస్ట్‌

May 23, 2022

అదేం విచిత్రమో.. పెద్దలు చూసిన పెళ్లికి ఒప్పుకుని, కాబోయే వరుడితో షికార్లు, ఫోటో షూట్‌లు చేసి.. అంతా అయ్యాక చివరకు ముహూర్తం సమయంలో ముఖం చాటేస్తున్నారు నేటి పెళ్లికూతుళ్లు. ఏపీలోని అనకాపల్లికి చెందిన పుష్ప, విశాఖపట్నంకు చెందిన సృజన.. తాజాగా కర్ణాటకలోని మైసూరుకు చెందిన సించన. పెళ్లికొడుకు తాళి కడతాడునుకున్న సమయంలో పెళ్లి వద్దని కళ్లు తిరిగి పడిపోయినట్లుగా యాక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఘటన మైసూరు నగరంలోని విద్యాభారతి కళ్యాణ మండపంలో ఆదివారం చోటుచేసుకుంది.

 

హెచ్‌డీ కోటెకు చెందిన యువకునితో మైసూరుకు చెందిన సించన అనే యువతికి పెద్దలు ఇటీవలే నిశ్చితార్థం చేశారు. పెద్దలు చూసిన సంబంధానికి ఓకే చెప్పిన సించన.. తాళి కట్టే సమయంలో కళ్లు తిరిగి పడిపోయినట్లు యాక్ట్ చేసింది. కాసేపటి తర్వాత ఆ వరుడితో పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదని, తాను ఇంటి పక్కన ఉన్న మరో యువకున్ని ప్రేమించానని బాంబ్ పేల్చింది. పెళ్లంటూ చేసుకుంటే అతనితోనే అని తేల్చి చెప్పడంతో వధూవరుల తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు.

ఇదంతా వింటూ , ఏం జరుగుతుందో తెలియక షాకైన వరుడి తరపు బంధువులు.. కాస్త తేరుకొని ఇప్పుడు పెళ్లి వద్దంటే ఎలా? ఈ పెళ్లి కోసం రూ. 5 లక్షలకు పైగా ఖర్చు చేశామని, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో, స్థానిక పోలీసులు వచ్చి వధువుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. దీంతో వధూవరులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎవరు చెప్పినా వినేది లేదని, ప్రేమించినవాడినే పెళ్లి చేసుకుంటానని పెళ్లికూతురు భీష్మించడంతో ఖాకీలు సైతం ఏమీ చేయలేకపోయారు.