Bride-to-be loses hand due to medical negligence, wedding called off
mictv telugu

చెవి నొప్పితో ఆసుపత్రికి వెళితే చేయి కోల్పోయింది.. పెళ్లి రద్దు

September 2, 2022

 

చెవినొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన ఓ యువతి తన ఎడమచేతిని కోల్పోయిన ఘటన బిహార్‌ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం.. యువతి ప్రాణాలకే ముప్పును తెచ్చిపెట్టింది. శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ చెవినొప్పితో పాట్నాలోని మహావీర్‌ ఆరోగ్య సంస్థాన్‌ ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు జులై 11న శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఆమె ఎడమ చేతికి ఓ ఇంజక్షన్ ఇచ్చి పంపించారు. ఇంటికి వెళ్లిన రేఖ చేయి రంగు మారడంతోపాటు నొప్పిగా కూడా ఉండడంతో మళ్లీ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను కలిసి విషయం చెప్పింది. చూసిన డాక్టర్లు ఏమీ కాదని, తగ్గిపోతుందని చెప్పి పంపించేశారు.

కానీ చేయి నొప్పి తగ్గకపోవడమే కాకుండా ఎలాంటి మార్పు రాకపోవడంతో రేఖ పలు ఆసుపత్రుల్లో చూపించుకుంది. చివరికి పాట్నాలోని మేదాంత ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు చేతిని తొలగించాల్సిందేనని, లేదంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రేఖ కుటుంబ సభ్యుల అంగీకారంతో శస్త్ర చికిత్స చేసి ఎడమ చేతిని తొలగించారు. కాగా, రేఖకు ఇటీవల వివాహ నిశ్చితార్థమైంది. నవంబరులో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే ఆమె చేతిని కోల్పోవడంతో వరుడి తరపు వారు పెళ్లిని రద్దు చేసుకున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తమ కూతురి జీవితం ఇలా అయిపోయిందని ఆ యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మహావీర్ ఆరోగ్య సంస్థాన్ ఆసుపత్రి గుర్తింపును రద్దు చేయాలని రేఖ కుటుంబం ఐఎంఏకు విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనకు మహావీర్ ఆరోగ్య సంస్థే కారణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రేఖ కుటుంబీకులు చెబుతున్నారు.