పెళ్లి అప్పు.. కొత్త పెళ్లికొడుకు ఆత్మహత్య.. - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి అప్పు.. కొత్త పెళ్లికొడుకు ఆత్మహత్య..

April 24, 2018

అప్పు భారానికి ఒక యువకుడి నిండు ప్రాణం బలైపోయింది. పెళ్లిలో వంటలు చేసిన మనిషికి అప్పుపడిన కొత్త పెళ్లికొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివాహమై గట్టిగా నెలయినా కాకముందే జరిగిన ఈ ఉదంతం బంధుమిత్రులను కలచేస్తోంది. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌ పోలీస్‌ ఠాణా పరిధిలో ఈ విషాదం చోటుచేసుకుంది.

కంచన్‌బాగ్‌ డివిజన్‌ గులాం ముస్తఫానగర్‌కు చెందిన పాతికేళ్ల జలాలుద్దీన్‌ బుక్‌ బైండర్‌గా పనిచేస్తున్నాడు. గత నెలలోనే పెళ్లయింది. పేదవాడు కావడంతో పెళ్లికోసం అప్పులు చేశాడు. వంటమనిషి రూ.20 వేలు బాకీపడ్డాడు. ఎప్పుడు ఇస్తావ్ అని వంటమనిషి అడగడంతో జలాలుద్దీన్ ఇబ్బందిపడ్డాడు. సోమవారం అతడు జలాలుద్దీన్‌ ఇంటివద్దకు వచ్చాడు. జలాలుద్దీన్ తాను ఇంట్లో లేనని చెప్పాలని కుటుంబ సభ్యులతో చెప్పించాడు. దీంతో వంటమనిషి జలాలుద్దీన్‌కు ఫోన్ చేశాడు. తాను హయత్ నగర్లో ఉన్నానని, కాసేపట్లో ఇంటికి వస్తానని కొత్తవరుడు చెప్పాడు. ‘అయితే నువ్వు వచ్చే వరకు నీ ఇంటే వద్దే ఉంటాను.. ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే..’ అని వంటమనిషి బెదిరించాడు. దీంతో జలాలుద్దీన్ పరువు పోతుందని ఆందోళనకు గురై ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యలు తెలిపారు.