bridegroom rode in a bullock cart while the wedding procession took 100 luxury cars in surat Gujarat
mictv telugu

ఎడ్ల బండిపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పెళ్లి కొడుకు

February 26, 2023

bridegroom rode in a bullock cart while the wedding procession took 100 luxury cars in surat Gujarat

గుజరాత్.. సూరత్లోని ఓ పెళ్లి ఊరేగింపునకు ఏకంగా 100 కార్లు ఏర్పాటు చేశారు. అవి అన్నీ లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లే. ఇన్ని కార్లు ఉన్నా.. పెళ్లి కొడుకు మాత్రం సింపుల్గా ఎద్దుల బండిపై వచ్చాడు. తమ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఎద్దుల బండిపై కళ్యాణవేదికకు చేరుకున్నాడు. ఈ ఘటన గుజరాత్‌లోని బీజేపీ నేత కుమారుడి పెళ్లిలో చోటుచేసుకుంది. సూరత్‌కు చెందిన బీజేపీ నేత భరత్‌ వఘాశియా కుమారుడికి వివాహం జరిగింది. అతడి పెళ్లి ఊరేగింపులో రూ.కోట్ల విలువైన 100 విలాసవంతమైన కార్లను ఉపయోగించారు.

ఈ పెళ్లి ఊరేగింపును చూసేందుకు జనం భారీగా గుమిగూడారు. అన్ని ఖరీదైన కార్లు ఒకేచోట ఉండటంతో చూసేందుకు ఎగబడ్డారు. తొలుత వధువు కారులో రాగా.. ఆ వెనుక వరుడు మాత్రం ఎద్దుల బండిపై రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. సంప్రదాయాన్ని పాటిస్తూ అతడు పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. భరత్ వఘాశియా మాట్లాడుతూ.. ‘‘సౌరాష్ట్ర సంప్రదాయం ప్రకారం వివాహ ఊరేగింపు సమయంలో వరుడు ఎద్దుల బండిలో మాత్రమే వెళతాడు. ఇది తరతరాలుగా మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. నా కుమారుడికి ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం.. అందుకే ఊరేగింపులో రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల విలువైన కార్లను ఉపయోగించాం.. అదే సమయంలో సంప్రదాయాన్నీ కొనసాగించాం’’ అని తెలిపారు. ముందు 50 కార్లు.. వెనుక 50 కార్లు రాగా.. మధ్యలో ఎద్దుల బండి ఉంచామని వివరించారు. కార్ల ఊరేగింపు 2 కిలోమీటర్ల మేర సాగింది.