వీడియో : మంచు కరిగి.. వరద పెరిగి.. కూలిన బ్రిడ్జి - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : మంచు కరిగి.. వరద పెరిగి.. కూలిన బ్రిడ్జి

May 11, 2022

గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం ఎంతలా పెరుగుతుందో ఈ వీడియో చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. మంచు కొండలు భారీగా కరుగుతుండడం, వాటి వల్ల వరదలు పెరగడం, దాంతో సంభవించే నష్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనర్ధాలు ఉన్నాయి. ఈ అంశంపై ఇప్పటికే ప్రపంచ దేశాలు కొంత ప్రయత్నాలు చేసినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. తాజాగా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల జరిగిన సంఘటన మరోసారి దాని ఆవశ్యకతను గుర్తు చేస్తోంది. పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్‌లో ఈ ఘటన జరిగింది. గత శనివారం మౌంట్ షిప్పర్‌ ప్రాంతంలో ఉన్న గ్లేసియర్ లేదా హిమనీ నదం కరిగిపోయి వరద పోటెత్తింది. దాని ధాటికి కారకోరం అంతర్జాతీయ రహదారిపై ఉన్న హసన్‌బాద్ వంతెన కూలిపోయింది. ఈ వీడియోను పాకిస్తాన్ పర్యావరణ మంత్రి షెర్రీ రెహ్మాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వరద వల్ల పిల్లర్ల కింద ఉన్న మట్టి కొట్టుకుపోయి వంతెన కూలిపోయిందని నిర్ధారించామన్నారు. మరో రెండు రోజుల్లో తాత్కాలిక వంతెనను నిర్మిస్తామని చెప్పారు. కాగా, కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా ప్రపంచ నేతలు కృషి చేయాలని ఆమె కోరారు.