డబ్బులున్నాయి కదా అని గొప్పలకు పోతే ఎలాంటి కష్టాలు వస్తాయో ఉదాహరణగా నిలిచాడు బ్రిజ్ మోహన్ అనే వ్యక్తి. చండీగడ్‌లో ఉండే బ్రిజ్ మోహన్‌ది స్థితిమంతుల కుటుంబం. ఈ నేపథ్యంలో ఓ స్కూటీ కొనుక్కొని ఫ్యాన్సీ నెంబర్ కోసం రవాణా శాఖ నిర్వహించిన వేలంపాటలో పాల్గొన్నాడు. ch- 01- 0001 అనే నంబరు దక్కించుకోవడానికి పాడుతూ, పాడుతూ ఏకంగా రూ. 15.41 లక్షలకు దక్కించుకున్నాడు. దీంతో ఒక్కసారిగా దేశం చూపు తనవైపు తిప్పుకునేలా చేసుకున్నాడు. మీడియా ఇంటర్య్వూలు అంటూ వెంటపడింది. ఇదే సమయంలో ఇతనికి ఇంత ఆస్తి ఎక్కడిది అంటూ వివరాలు కనుక్కునే పనిలో పడింది ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్. దీంతో మనోడికి చిక్కులు ఎదురయ్యాయి. ఇంట్లో కూడా చివాట్లు పడడంతో వచ్చిన పేరు కంటే ఒత్తిడే ఎక్కువుందంటూ ఐటీ దాడులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రెండు రోజులుగా ఎవరికీ కనపడడం లేదు. కాగా, మారిన పరిస్థితుల నేపథ్యంలో బ్రిజ్ మోహన్ అంత మొత్తం చెల్లించి ఫ్యాన్సీ నెంబరు దక్కించుకుంటాడా? లేదా? అనే సందేహం రవాణాశాఖతో పాటు అక్కడి స్థానికులను కూడా చర్చించేలా చేసింది.