Bring Netaji's Remains Back to India, Says Daughter Anita Pfaff
mictv telugu

నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలి.. సుభాష్ చంద్రబోస్ కూతురు

August 15, 2022

 

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలను భారత్కి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్‌ ఫాఫ్‌ అన్నారు. జపాన్ రాజధాని టోక్యో రెంకోజీ టెంపుల్‌లో ఉన్న నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ఆమె కోరారు. రెంకోజీ టెంపుల్‌లో ఉన్న అస్థికలు నేతాజీవేనా కాదా అనే విషయంలో డీఎన్‌ఏ టెస్ట్ చేయాలనుకుంటే తాను అందుకు సిద్ధమని అనిత ప్రకటించారు. నేతాజీ స్వాతంత్ర్యం అనుభవించడానికి జీవించి లేరు కావచ్చు.. కానీ, అతని అవశేషాలను అయినా దేశానికి తిరిగి తీసుకురావడం కొంత సంతృప్తినిస్తుందని ఆమె అన్నారు.

భారత ప్రభుత్వం, జపాన్ ప్రభుత్వం రెండూ ఈ అంశంలో దాటవేత ధోరణితో ఉన్నాయని, నేతాజీ బోస్ ప్రతిష్ఠను మసకబార్చాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. ఇది తమకు కొంచెం అసౌకర్యంగా ఉన్నట్లు భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం జర్మనీలో ఉంటోన్న అనితా బోస్ ఆర్ధిక శాస్త్ర ప్రొఫెసర్. ఆమె వయసు 79 సంవత్సరాలు. 1937లో నేతాజీ తన కార్యదర్శి ఎమిలీని ఆస్ట్రియాలో రహస్య వివాహం చేసుకోగా.. 1942లో ఆస్ట్రియాలో అనిత జన్మించారు. నేతాజీ బ్రిటీష్‌వారిపై పోరాటంలో భాగంగా జర్మనీ నుంచి ఆసియాకు వెళ్లిపోయినప్పుడు అనిత వయసు నాలుగు నెలలు మాత్రమే. నేతాజీ 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారని అందరూ విశ్వసిస్తున్నప్పటికీ, నేతాజీ మరణం ఓ మిస్టరీగా మిగిలిపోయింది.