ఫార్మా రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నగరంలో మరో అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజ సంస్థ బ్రిస్టల్ మేయర్స్ తొలుత రూ. 800 కోట్లతో యూనిట్ పెట్టనుంది. దీంతో 1500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో అధికారులు సంస్థ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా యూనిట్ పెట్టాలంటే 18 నెలల వరకు సమయం పడుతుందని కానీ తెలంగాణలో మాత్రం వెంటనే మొదలు పెట్టవచ్చని తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగం రాష్ట్రంలో చాలా వేగంగా ఎదుగుతోందన్నారు.
ఇప్పటివరకు దేశంలో లేని ఓ సంస్థ తొలిసారి నగరంలో పెట్టుబడి పెట్టడం గర్వకారణమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ని నగరంలో ఏర్పాటు చేస్తున్నామని కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ వివరించారు. కంపెనీ ప్రతినిధి హిరావత్ మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం చూసిన హైదరాబాద్ కంటే ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి కనిపిస్తుందని, వచ్చే మూడేళ్లలో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని వెల్లడించారు.