పోలీస్ అన్న, నక్సలైట్ చెల్లెలు.. ఓ ఎన్‌కౌంటర్, చివరికి.. - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్ అన్న, నక్సలైట్ చెల్లెలు.. ఓ ఎన్‌కౌంటర్, చివరికి..

August 10, 2019

Brother and sister an emotional encounter.

సినిమా కథ కాదు, తుపాకుల గర్జన సాక్షింగా నిజంగా జరిగిందే. అన్న పోలీస్, అతని చెల్లెలు నక్సలైట్. ఒక తల్లి పాలు తాగారు. ఒక తండ్రి చేతులు పట్టుకుని నడిచారు. కలిసి పెరిగారు. కానీ కాలప్రవాహంలో ఇద్దరి దారులూ వేరయ్యాయి. చివరకు యాదృచ్ఛికంగా ఇద్దరూ అడవిలో ఎన్‌కౌంటర్ నడుమ ఒకరినొకరు చూసుకున్నారు. ‘చెల్లెమ్మా లొంగిపో’ అని అన్న గట్టిగా అరిచాడు. తలపై రూ. 5 లక్షల రివార్డు ఉన్న ఆ చెల్లెలు అతని మాట పట్టించుకోలేదు. తను నమ్మిన సిద్ధాంతాన్నే అనుసరించింది. కానీ ఎదురుగా ఉన్నది సొంత అన్న! మరి ఆమె ఏం చేసింది??

ఛత్తీస్‌గఢ్ ‌లోని సుక్మా జిల్లా బలేంగ్తాన్ అడవుల్లో గత నెల 29న ఎన్ కౌంటర్ జరిగిది. మావోయిస్టుల శిబిరాన్ని 140 మంది పోలీసులు చుట్టుముట్టారు. వారిలో వెట్టి రామ ఒకరు. పోలీసులు కాల్పులతో  మావోయిస్టులు కూడా తమ తుపాకులకు పని చెప్పారు. వెట్టి రామకు వారిలో తన చెల్లెలు కన్నీ కనిపించింది. ఇద్దరూ ఎదురు బొదురుగా నిలబడ్డారు. మాటలకు అది సమయం కాదు. వెంటనే లొంగిపోవాలని అన్న చెల్లెలికి గట్టిగా అరిచి చెప్పాడు. కానీ కన్నీ పట్టించుకోలేదు. అన్న కనిపించాడన్న భావోద్వేగం, ట్రిగర్ నొక్కాలా వద్దా సంశయం నడుమ ఆమె సహచరుల తుపాకులు గర్జించాయి. రామపై కన్నీ సహచరులు కాల్పులు జరిపారు. కన్నీ చేసేదేమీ లేక వారితో కలిసి దట్టమైన ఆ దండకారణ్య అడవుల్లోకి పారిపోయింది. రామ మావోయిస్టుల కాల్పుల నుంచి సురక్షితంగా తప్పించుకున్నాడు. ఈ  తోటుబుట్టువులది గగన్‌పల్లి గ్రామం అని పోలీసులు వెల్లడించారు. ‘వీరిద్దరూ బాల్యంలో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. తర్వాత రామ పోలీసులకు లొంగిపోయాడు. కన్నీ మాత్రం ఉద్యమంలోనే ఉంది. తర్వాత రామకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది’ అని తెలిపారు.